నవాబ్‌పేట, జనవరి 5 : మండలంలోని దేపల్లి నుంచి ఎర్రమట్టి యథేచ్ఛగా తరలిపోతున్నది. 10రోజుల నుంచి వందల కొద్ది టిప్పర్ల ద్వారా ఎర్రమట్టి తరలించుకుపోతున్నా అడిగే నాథుడే లేడు. మండలంలోని దేపల్లి శివారులోని కొంత మంది రైతుల వ్యవసాయ పొలాల నుంచి శంషాబాద్‌కు చెందిన ఇటుకల వ్యాపారులు అక్రమంగా ప్రతి రోజూ టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని తరలిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లోని రైతుల పొ లాల నుంచి సైతం మట్టి ని తరలించినా గ్రామపంచాయతీలో ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మైనింగ్ అధికారుల అనుమతి కూడా తీసుకోవాలని నిబంధన లు చెబుతున్నాయి. కానీ కొంత మంది స్థానిక నాయకులు మధ్య వర్తి త్వం వహించి పట్టాదారు రైతులకు నయానో, బయానో చెల్లించి రూ.లక్షల విలువజేసే మట్టిని తరలించుకుపోతున్నారు. ఈ దందా 10 రోజుల నుంచి కొనసాగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. రాత్రి వేళ అక్రమంగా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు.
200 టిప్పర్ల ఎర్రమట్టిని ఇటుకల దందాకు తరలించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కొందరు గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి అక్రమ మట్టి తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిని వ్యాపారులు బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయ మై తాసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. రైతుల పొలాల్లో సై తం మట్టి తరలించాలన్నా ఖచ్చితంగా మై నింగ్ అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ విషయాన్ని మైనింగ్ అధికారులకు తెలియజేసి విచారణ చేపడతామన్నారు.