మహబూబ్‌నగర్, అక్టోబర్ 30 : బీఆర్ఎస్ కార్యకర్త వరద భాస్కర్ ముదిరాజ్‌ను అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపేటకు చెందిన వరద భాస్కర్ ము దిరాజ్ను సోమవారం పోలీస్‌స్టేషన్‌లో సీఐ అప్పయ్య చితకబాదడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని పరామర్శించారు. అకారణంగా దాడి చేసిన తీరును నిరసిస్తూ అక్కడి నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న సీఐతో మీరు తెలంగాణ కొడుకులు అని ఏ విధంగా సంభోదిస్తారని, ఆంధ్రా అధికారి అయిన మేము ఏనా డు మిమ్మల్ని అగౌరపర్చలేదని, కానీ మా తెలంగాణ వాదులపై వాడు, వీడు అని అసభ్య పదజాలంతో బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేసి ఎందుకు దాడి చేస్తున్నారని, ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వన్‌టౌన్ సీఐ, రూరల్ సీఐ కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఇవి సమాజానికి మంచి కాదని హెచ్చరించారు. తెలంగాణ పోరాటంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, జైలుకు కూడా వెళ్లామని, ఇవి మాకు కొత్తకాదన్నారు. అయితే ఏ ప్రభుత్వం శాశ్వతంగా కాదన్న విషయం తెలుసుకొని పోలీసులు మసులుకోవాలని హితవు పలికారు. కార్యకర్తలు కూడా ఎన్ని కేసులు పెట్టినా బెదిరిపోవద్దని మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి మీ కోసం పోరాడుతుందని భరోసా ఇచ్చారు.