కల్వకుర్తి రూరల్ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు(Teachers) అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించడంతోపాటుగా మంచి ఫలితాలు లభిస్తాయని నాగర్కర్నూల్ విద్యాశాఖాధికారి రమేష్ కుమార్( DEO Ramesh Kumar) సూచించారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ప్రాథమిక పాఠశాలల ఎమ్మార్పీలకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ( Summer training Camp) సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ శిబిరాలు గతంలో పాఠశాలలు ప్రారంభం వెంటనే ఉండేవని అయితే ప్రభుత్వం వేసవి సెలవుల్లోనే ఐదు రోజుల శిక్షణను ముందస్తుగానే ఇస్తుండడం వల్ల చక్కటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో 10వ తరగతి పరీక్షల్లో 23వ స్థానంలో ఉండగా ఈ ఏడాది పదవ తరగతి వార్షిక ఫలితాలలో నాగర్ కర్నూల్ జిల్లా 13వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు.
ఉపాధ్యాయులు మరింత శ్రమిస్తే ఇంకా మంచి స్థానంలో నిలిచే అవకాశం ఉంటుందని వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు చేయాలన్నారు. అభ్యసన సామర్థ్యాలను బట్టి వారిని ఆకర్షించే విధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ని ఉపయోగిస్తూ విద్యా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్ నాయక్, డీఆర్పీలు, తదితరులు ఉన్నారు.