మాగనూరు : మాగనూర్, కృష్ణ ఉమ్మడి మండలాలలో కొన్ని నెలలుగా జరుగుతున్న గొర్ల దొంగతనాలపై (Sheep Thieves) పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కురుమ సంఘం( Kurama Sangam) నాయకులు ఆరోపించారు. పోలీసులు స్పందించకపోతే జాతీయ రహదారిపై గొర్రెలతో ధర్నా చేపడుతామని హెచ్చరించారు. ఉమ్మడి మండలాల్లో సుమారు 3 వందల గొర్రెలను, మేకలను దొంగిలించారని ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చర్యలు తీసుకుంటామని బాధితుల నుంచి రూ.20 వేలు పోలీసులు తీసుకున్నారని ఆరోపించారు. కర్ణాటకకు చెందిన దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పట్టించిన దొంగలకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలాలలో దాదాపు 16 మంది బాధ్యుల నుంచి దొంగతనాల ఫిర్యాదులు ఉండగా ఒక నాలుగు నుండి ఐదు కేసులు మాత్రమే ఎలా చేస్తారని ప్రశ్నించారు. రెండు , మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున గోర్లతో ధర్నాకు దిగుతామని కురుమ సంఘం నాయకులు హెచ్చరించారు.