
మహబూబ్నగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరి సాగు కోసం రైతులు అత్యధికంగా ఎరువులు వాడడంతో భూములు సారం కోల్పోతున్నాయి. ఫలితంగా భవిష్యత్లో వ్యవసాయానికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులను యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలను వేయాలని సూచిస్తున్నారు. ఈ పంటలతో రైతులకు లాభాలు రావడంతోపాటు భూసారాన్ని సైతం పెంచుతాయని వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గుతాయంటున్నారు. గతేడాది మహబూబ్నగర్ జిల్లా పరిధిలో కేవలం 6 వేల ఎకరాల్లో మాత్రమే వేరుశనగ సాగు చేయగా.. ఈ ఏడాది 24 వేలకు పెరిగింది. మహబూబ్నగర్ డివిజన్ పరిధిలో వెయ్యి ఎకరాల్లో సాగైన పల్లి ఈ ఏడాది 6 వేలు దాటింది. వరితో రైతులకు కలిగే అనర్థాలను అర్థమయ్యేలా వివరించడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం ధాన్యం కొనబోమని పార్లమెంట్ సాక్షిగా చెప్పడంతో అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం పంట మార్పిడి దిశగా ప్రోత్సహిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆరుతడి పంటల ప్రాధాన్యతను స్పష్టంగా వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతులు ఆరుతడి వైపు మొగ్గు చూపుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో వరికి బదులు ఎక్కువగా వేరుశనగ సాగుచేస్తున్నారు. పల్లితోపాటు పొద్దుతిరుగుడు, జొన్న, నువ్వులు, ఆముదం, రాగులు, మొక్కజొన్న, మినుములు, కుసుమలు, కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. తొలుత వరి పంట తప్పా వేరే వేయమంటూ భీష్మించుకున్నా.. రైతులకు పరిస్థితిని, వరితో కలిగే దుష్పరిణామాలను వివరించి పంట మార్పిడికి ఒప్పించారు. భవిష్యత్లో వీరిని చూసి మరికొంత మంది రైతులు పంట మార్పిడికి ముందుకొచ్చేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు. భూత్పూర్ మండల కేంద్రంలో వరికి బదులుగా 200 ఎకరాలకు పైగా వేరుశనగ సాగవుతున్నది. 50 ఎకరాల్లో ఆముదాలు సాగు చేస్తున్నారు. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్నది.
యాసంగిలో ఇతర పంటలే మేలు..
పంట మార్పిడితో భూమి సారవంతమవుతుంది. సెప్టెంబర్ నుంచి రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. రైతువేదికల్లో వారానికి రెండు సార్లు శిక్షణ ఇస్తున్నాం. పంట మార్పడి బాగా జరిగింది. మహబూబ్నగర్ డివిజన్లో ఈ ఏడాది 6 వేల ఎకరాల్లో వేరుశనగ, 4 వేల ఎకరాల్లో రాగులు, 500 ఎకరాల్లో మొక్కజొన్న, దాదాపు 700 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. గత యాసంగిలో 60 వేల ఎకరాల్లో పంటలు సాగైతే.. అందులో 40 వేల ఎకరాల వరి, 20 వేల ఎకరాల్లో ఇతర పం టలు వేశారు. కానీ ఈ సారి వరి 20 నుంచి 25 వేల ఎకరాలకే పరిమితమైంది.