Ranu Bombai Ki Ranu | భూత్పూర్, మార్చి 29: యూట్యూబ్‌లో ఇప్పుడు ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సెన్సేషనల్‌గా మారింది. అత్యధిక వ్యూస్‌తో ఈ ఫోక్ సాంగ్ దూసుకెళ్తుండటం పట్ల ఆ పాట రచయిత రాము రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందని అన్నారు. భూత్పూర్ మండల కేంద్రంలోని స్థానిక వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ నర్సింహులు ఆధ్వర్యంలో కవితల పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాము రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా రాము రాథోడ్ మాట్లాడుతూ.. తనకు చిన్నతనం నుంచి డ్యాన్సులు అంటే చాలా ఇష్టంగా ఉండేదని, ముఖ్యంగా చిరంజీవి సినిమాలు చూసి డాన్స్ పట్ల ఎక్కువ ఆకర్షితుడినయ్యానని తెలిపారు. ‘డ్యాన్స్ మీద ఇష్టంతో పెండ్లిలో పెట్టిన బాక్సుల దగ్గర డ్యాన్స్ చేసేవాడిని. అది చూసి చాలామంది మెచ్చుకునేవాళ్లు. ఒకసారి అలా డ్యాన్స్ చేస్తుంటే పెళ్లికొడుకు వంద రూపాయల నజరానా ఇచ్చాడు. డ్యాన్సులు చేస్తే డబ్బులు వస్తాయని అప్పుడే తెలిసింది. కానీ మా ఇంట్లో వాళ్లు వీడు పిచ్చోడిలా పాటలు పాటలు అంటూ డ్యాన్సులు చేస్తే భవిష్యత్తు ఎట్లా అని మందలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా నేను నా ఇష్టాన్ని మార్చుకోలేదు. ఇదే క్రమంలో ఈ పాఠశాలలోనే గోరటి వెంకన్న, గద్దర్ ప్రోగ్రామ్‌లు చూసి, వాళ్ల కార్యక్రమాలకు వచ్చిన జనాలను చూసి మరింత ఉత్సాహంగా ఫీలయ్యా. ‘ అని తెలిపారు.
‘ డాన్స్ అంటే ఎంతో అమితంగా ఇష్టపడే రోజుల్లో నాకు నాగర్ కర్నూలుకు చెందిన పోలోజు సత్యం మాష్టారుపరిచయం అయ్యాడు. ఆయన దగ్గర డాన్స్ నేర్చుకుంటూ, భూత్పూర్ లో దేవీ నవరాత్రుల ఉత్సవాలలో, జాతర, పెళ్లిళ్లు మొదలైన వేడుకలలో నేను డాన్సులు చేయడం ప్రారంభించాను. కరోనా సమయంలో ఇంట్లో ఉండలేక చిన్నచిన్న పాటలను రాస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసేవాణ్ని. నా పోస్టులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 2022 సంవత్సరంలో నేను సొంతంగా సంక్రాంతి పండుగకు సంబంధించి పాటను రాశాను. ఆ పాటను చిత్రీకరించడానికి ఫొటోగ్రఫీకి, డ్రెస్సులకు, లొకేషన్ లకు దాదాపు లక్ష రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. నాది బీద కుటుంబం కావడంతో చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో మా ఊరిలోని బీఆర్ఎస్ నాయకులు మేకల సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి ముందుకు వచ్చి మండల బీఆర్ఎస్ నాయకులతో పరిచయం చేశారు. వీళ్లంతా కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి లకు పరిచయం చేశారు. వాళ్లు కూడా ఆర్థికంగా సహాయం చేయడంతో ఆ పాట చిత్రీకరణ పూర్తి చేశాను. ఆ విధంగా నేను పూర్తిగా పాటల ఈ విషయంలో మునిగిపోయాను.’ అని రాము రాథోడ్ తెలిపారు.
‘ నా జీవితంలో ఓ చిన్ని రాములమ్మ అనే పాట ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ పాట అనంతరం నాకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాకుండా ఇటీవల రాను బొంబాయికి రాను అనే పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ కావడంతో ఈ పాట ఇప్పుడు అంతర్జాతీయంగా ఐదో స్థానంలో నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ పాటలో పాలమూరు పంచవన్నవి అని మాటను మన జిల్లాను జాతీయస్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో రాసినట్లు’ రాము రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం జానపద పాటల చిత్రీకరణలతో పాటు కొత్తగా నాలుగు సినిమాలకు అవకాశం వచ్చినట్లు ఆయన తెలిపారు. నేను ఎంత ఎత్తుకు ఎదిగిన నా గ్రామాన్ని నాకు సహకరించిన నా వాళ్లను ఎప్పటికీ విస్మరించినని అన్నారు. భవిష్యత్తులో చిన్నారులకు డ్యాన్స్ అవసరం వచ్చినప్పుడు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.