మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, అక్టోబర్ 9 : జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్‌పల్లి సర్వే నెంబర్ 523లో ఉన్న ఆదర్శనగర్లోకి మరోసారి బుల్డోజర్, బెంజ్ వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు వచ్చాయి. బుధవారం రెవెన్యూ అధికారులు కాలనీలో పర్యటించారు. ఆగస్టు 29న రాత్రికి రాత్రే ఆ ప్రాంతంలో 75 ఇండ్లను నేల మట్టం చేసిన అధికారులు.. వాటికి సంబంధించిన కాంక్రీట్ దిమ్మెలు, సామగ్రి, రేకులు, ఇంటి శిథిలాలు తొలగించేందుకు వాహనాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉండగా, ఒక వైపు హైడ్రా హడలెత్తిస్తుండగా.. పాలమూరులో ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో ఎప్పుడు, ఎక్కడ ఏ కూల్చివేత చూడాల్సి వస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు హైడ్రా కూల్చివేతల భయం ఆదర్శనగర్ స్థానికులకు పట్టుకున్నది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇండ్లను ఎక్కడ కూల్చివేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
ఆదర్శనగర్‌లోని దివ్యాంగుల ఇండ్లతోపాటు పేదలు నిర్మించుకున్న గుడిసెలు, రేకుల షెడ్లు, ఇండ్లను అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేశారు. ఇప్పుడు బుల్డోజర్లు, ఇతర వాహనాలు ఆ ప్రాంతంలో తిష్టవేయడంతో కాలనీవాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కూల్చిన ఇండ్ల శిథిలాలు తొలగిస్తున్నా.. స్థానికులు కన్నీరు పెడుతూ లోలోపల ఆందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ సిబ్బంది, వాహనాల వద్దకు వెళ్తే క్రిమినల్ కేసులు పెడతామంటూ కొందరు సిబ్బంది భయపెట్టడంతో వారు ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సైతం తీసుకునేందుకు వెనకాడుతున్నారు.
ఇండ్లను కూల్చివేసిన అధికారు లు ఏదైనా మంచి చేస్తారేమోనని భావించాం. ఇప్పుడు ఉన్నది కూ డా తీసుకొని పోతే మేం ఏం చేయా లి. అయోమయంలో ఉ న్నాం. ఉన్నవాటితోనైనా సర్దుకొని గూడు గోస కట్టుకుందామంటే మరోసారి కనీస సమాచారం లేకుండా వాహనాలు రావడంతో దిక్కుతోచని దుస్థితి నెలకొన్నది. ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.
– రంగదాసు, బ్లైండ్లేమ్ వెల్ఫేర్ అసోసియేషన్