అయిజ, జూలై 31 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద చేరుతున్నది. దీంతో అధికారులు 10గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 35,704క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 24,008 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న డ్యాంలో ప్రస్తుతం 103.018 టీఎంసీలు నిల్వ ఉన్నది. 1633 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గానూ, ప్రస్తుతం 1632.31అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అదేవిధంగా ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరదనీరు నిలకడగా చేరుతున్నది. ఆనకట్టకు ఇన్‌ఫ్లో 63,579 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 63,100 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 479 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11.6 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. వరద రాకతో అయిజ మండలం, పులికల్ వద్ద నాగల్‌దిన్నె వంతెన సమీపంలో వరదనీరు నిండుగా ప్రవహిస్తున్నది.
జూరాల ప్రాజెక్టుకు..
అమరచింత, జూలై 31: ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టులో వరదనీరు పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 62వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. విద్యుదుత్పత్తి కోసం 42,393 క్యూసెక్కుల వినియోగిస్తున్నారు. భీమా లిప్ట్-2కు 750, కుడికాల్వకు 508క్యూసెక్కులు, ఎడుమ కాల్వకు 1,060 క్యూసెక్కులు వరదనీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తంగా 71,029 క్యూసెక్కుల వరదనీరు దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికాలు తెలిపారు. పెరిగిన వరదతో 6గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా సెలవురోజు కావడంతో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శ్రీశైల జలాశయానికి..
శ్రీశైలం, జూలై 31: శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వరదనీరు నెమ్మదిగా వచ్చి చేరుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 24,222, విద్యుదుత్పత్తి ద్వారా 42,454, సుంకేసుల నుంచి 62,580 క్యూసెక్కులు (మొత్తం 1,29,256 క్యూసెక్కులు) విడుదల కాగా సాయంత్రానికి లక్షా 10వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదైంది. కాగా, ఏపీ పవర్‌హౌస్ ద్వారా 10,189, టీఎస్ పవర్‌హౌస్ ద్వారా 31,784క్యూసెక్కుల నీటితో విద్యుదుత్పత్తి చేసి దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, ప్రస్తుతం 880.50అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215టీఎంసీలు కాగా, ప్రస్తుతం 190.77టీఎంసీలు నిల్వ ఉన్నది.
కోయిల్‌సాగర్‌లో 20.4అడుగులు
దేవరకద్రరూరల్, జూలై 31: మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌లో 20.4అడుగుల నీటినిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 32.6(2.27 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 20.4అడుగుల వద్ద ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు సాగునీరు విడుదలవుతున్నది. నారాయణపేట, మద్దూర్, కొడంగల్ మండలాలకు 10క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.