మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. లోతట్టు ప్రాం తాల్లోని జనావాసాల్లోకి వరద నీరు రా వడంతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జడ్చర్ల పట్టణంలో కూ డా ఇదే పరిస్థితి నెలకొన్నది. నారాయణపేట జిల్లాలో మ ట్టి మిద్దె కూలి తల్లీకూతు రు మృతిచెందారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, భీ మా, దుందుభీ నదులతోపాటు వాగులు, వం కలు పొంగిపొర్లుతున్నాయి. కోయిల్సాగ ర్, సరళాసాగర్, రామన్‌పాడు, శంకర సము ద్రం రిజర్వాయర్లు నిండిపోవడంతో గేట్లను ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు.
వరదల్లో చి క్కుకున్న ఇద్దరిని పోలీసులు స్థానికుల సాయంతో సురక్షితంగా కాపాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో ఇద్దరు గొర్రెల కాపరులు 200 గొర్రెలతో స హా వాగులో చిక్కుకోగా కలెక్టర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. హన్వాడ సమీపంలోని ఇబ్రహీంబాద్ వద్ద మహబూబ్‌నగర్-తాండూర్ జాతీయ రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో శ్రీశైలం హైవేను తాత్కాలికంగా నిలిపివేశారు. వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అనేక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, ఎస్పీలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉండడంతో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీలను తెగిపోయిన రహదారిని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీఆర్ఎ స్ నాయకులతో కలిసి పరిశీలించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరెంట్ కోతలు విధించారు. వర్షాల ప్రభావంతో ట్రాన్స్‌కో సిబ్బంది ముందస్తుగా పవర్ కట్ చేయడంతో అనేక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం జలదిగ్బంధం లో చిక్కుకున్నది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాలమూరు పట్టణం పూర్తిస్థాయి లో తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఎడతెరిపిలేని వర్షాలకు రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. పెద్ద చెరువు కొత్తచెరు వు అలుగు పారుతుండడంతో పట్టణంలోని లో తట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతున్నది.
జ డ్చర్ల సమీపంలోని పెద్దగుట్టపై కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మ క్తల్ నియోజకవర్గంలోని ఊట్కూరు పెద్ద చెరువు అలుగు పారడంతో పంటలన్నీ నీట మునిగాయి. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కేఎల్ఐ కాల్వలు తెగిపోగా పంట పొలాలను వరద ముంచెత్తడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గేట్లు అన్ని ఎత్తి 3,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కం దూరు వాగు ఉప్పొంగడంతో వనపర్తి జిల్లాలోని సరళాసాగర్ ప్రాజెక్టు గేట్లు ఆటోమెటిక్‌గా తెరుచుకున్నాయి. దీంతో కొత్తకోట-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు వనపర్తి జిల్లాలోని శంకరసముద్రం గేట్లను కూడా ఎత్తివేశారు. రామన్‌పాడు గేట్లు కూడా ఓపెన్ చేశారు. నది ఉ ప్పొంగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలు సూచిస్తున్నారు.