మహబూబ్ నగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు కుంటలకు జలకళ సంతరించుకున్నది. అనేక చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అనేక చెరువుల్లోకి వర్షం నీళ్లు వచ్చి చేరాయి. 24 గంటల్లో మహబూబ్‌నగర్, నారాయణ పేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నవాబుపేట, బాలానగర్, కోస్గి, గందీడ్ మండలాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. పాత ఇండ్లు కూలిపోవడంతో చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా లో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. నవాబ్‌పేట మండలం లో వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. ఓ కుటుంబం తృటిలో ప్రాణాలతో బయటపడింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో జలకళ సంతరించుకుంది. కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. దుందుభీ వాగుకు కూడా ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జిల్లో వర్షపు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాగులు వంకలు, చెరువులు అలుగు పారుతుండడంతో రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజుల తర్వాత వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వ్యవసాయ పనులు పొందుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడడంతో ఎర్రకుంట రామయ్య బౌలి ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఎడతెరపి లేకుండా కురుస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వాగులు పారుతుండగా.. కొన్ని కుంటలు, చెరువులు మత్తడి పోస్తున్నాయి. పాలమూరు జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల పాడుబడిన ఇండ్లు కూలిపడ్డాయి. పంటలు కళకళాడుతుండగా.. రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షం
అల్పపీడన ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిశాయి. నవాబ్‌పేట, గండీడు, బాలానగర్ మండలాల్లో అతి భారీ వర్షం కురిసింది. కోయిలకొండ, మూసాపేట, మహబూబ్‌నగర్ మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ముసురు వర్షంతో ప్రారంభమై భారీ వర్షాలు కురవడంతో అనేక చెరువుల్లో నీరు చేరింది. కొన్ని చెరువులు అలుగును పారాయి వాగులు, వంకల్లో వర్షపు నీరు పొంగిపోవడంతో దుందుభీ వాగుకు కోయిల్ సాగర్ కు ప్రవాహం పెరిగింది మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షం ధాటికి పాత ఇండ్లు కూలిపోయాయి. అనేకమంది నిరాశ్రయులయ్యారు. వీరందరికీ అధికార యంత్రాంగం పునరావాస చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు