మక్తల్ టౌన్, జనవరి 8; క్రీడలతోనే ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ వనజమ్మ అన్నారు. మక్తల్ మండలం పంచదేవ్పాడ్ గ్రామంలో మైబుసుభాన్ ఉర్సు సందర్భంగా కీర్తిశేషులు నర్సింహాచారి జ్ఞాపకార్థం ఆనంద్చారి, సంతోష్చారి సహకారంతో ఆదివారం గ్రామంలోని పల్లెప్రకృతి వనం దగ్గర, ఏర్పాటు చేసిన ఓపెన్ టూ ఆల్ కబడ్డీ టోర్న మెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఉల్లాసంగా ఉత్సహంగా ఉంటారని పేర్కొన్నారు.
నేడు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎంతోమంది క్రీడాకారులు, రాష్ట్ర జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తూ గ్రామీణ ప్రాంతాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారని అన్నారు. క్రీడకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహన్ని అందిస్తుందన్నారు. పంచదేవ్పాడ్ గ్రామంలో పోటీలను నిర్వహించడం అనందదాయకమన్నారు. క్రీడల్లో ఓడినవారు నిరుత్సాహపడకుండా ఓటమి గెలుపునకు నాందిగా భావించి స్నేహపూరితమైన వాతావరణంలో పోటీలు నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్. కల్పనా కృష్ణాచారి, ఉప సర్పంచ్ తిప్పమ్మ, పస్పుల సర్పంచ్ దత్తప్ప, వార్డు మెంబర్లు, గ్రామస్తులు క్రీడాకారులు పాల్గొన్నారు.