జోగుళాంబ గద్వాల జిల్లాలో మైనర్ బాలికలపై వేధింపులు పెరిగాయి. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో దానిని అనుసరిస్తూ యువకులు తప్పుదోవ పడుతున్నారు. దీంతో గద్వాల నియోజకవర్గంలో అమ్మాయిలు, బాలికలు బయట తిరగాలన్నా.. ఇంటిలో ఒంటరిగా ఉండాల న్నా భయపడుతున్న పరిస్థితి దాపురించింది. ఉన్మాదుల చర్యలతో తల్లిదండ్రులు కడుపు కోత అనుభవిస్తుండగా.. వేధిస్తున్న వారు రాజకీయ నాయకుల అండదండలతో రోడ్లపై దర్జా గా తిరుగుతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని సరస్వతీ పాఠశాలలో చదువుతున్న హైస్కూల్ విద్యార్థిని లక్ష్మీ, కొట్టం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఆసియాబేగంపై జరిగిన లైంగిక దాడి, హత్యతోపాటు గద్వాలను న్యూడ్ కాల్స్‌తో గలీజు పట్టించి వివాహిత మహిళలను బజారుకు ఈడ్చీ సభ్య సమాజం తలదించుకునేలా చేశాయి. ఇంత జరుగుతున్నా ఇక్కడి పాలకులకు ఇవేవీ పట్టవు. నేరస్తులను శిక్షించాల్సిన వ్య వస్థలు రాజకీయ నేతల జోక్యంతో మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో రెండు నెలల్లో ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి.
– గద్వాల, నవంబర్ 7
సంఘటన జరిగిన ప్రతిసారి అధికార పార్టీ నాయకులు తప్పా అందరూ బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారే తప్పా.. ఆ కుటుంబాలకు న్యాయం జరగడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. దీంతో బాధిత కుటుంబాలు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. బిడ్డలను కోల్పోయి, వేధింపులతో ఆ కుటుంబాలు మనోవేదనకు గురవుతుంటే పరామర్శలు మరింత కుంగదీస్తున్నాయి. ఏదో జరిగింది అని ఊరు దాటని గుట్టును ప్రజా సంఘాలు, పార్టీల నేతలు గుట్టు రట్టు చేస్తున్నారు. గుట్టు రట్టు చేసినా బాధితులకు న్యాయం జరిగిందా అంటే అదీ లేదు. అందుకు ఉదాహరణలు మైనర్ బాలిక రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. దీంతోపాటు బుధవారం బిడ్డకు లైంగిక వేధింపులు తాళలేక పరశురాముడు ఆత్మహత్యకు కారకుడైనా యువకుడిని అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం వల్లే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా జిల్లాలో మహిళలు, బాలికలు రక్షణ లేకుండాపోయింది. అమ్మాయిలను వేధిస్తున్న వారిపై పోలీసులు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని బాధిత కుటుంబాలతోపాటు ప్రజలు చర్చించుకుంటున్నారు.