జడ్చర్లటౌన్, మార్చి 30: ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే పండుగల్లో రంజాన్ అత్యంత పవిత్రమైనది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెల రంజాన్ మాసం ముగిసి ఆకాశంలో నెలవంక దర్శనమివ్వగానే షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. షవ్వాల్ మొదటి రోజున ముస్లింలు రంజాన్ (ఈదుల్ ఫితర్) పండుగను జరుకొంటారు.
రంజాన్ పండుగ సందర్భంగా ముందస్తుగా ఈద్గాలను ముస్తాబు చేసి కొత్త దుస్తులు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరూ ఆలింగనం చేసుకొంటూ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెల రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించబడినందున ముస్లింలు ప్రత్యేకంగా నెలరోజులపాటు దైవచింతనలోనే గడుపుతారు.
భక్తిశ్రద్ధలతో ఉపవాసదీక్షలు చేపట్టంతో పవిత్ర గ్రంథం ఖురాన్‌ను పఠనం చేస్తూ, రంజాన్ నెలలో ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు కఠోరమైన ఉపవాసదీక్షలు చేపడతారు. రాత్రిళ్లూ మసీదులకు వెళ్లి తరావిహ్ ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెలలో 27వ రోజు రాత్రి ప్రత్యేకంగా షబ్ఖదర్ను జరుపుకొంటారు. ఆ రోజు రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లాహ్‌ను ఆరాధిస్తే పాపాల నుంచి విముక్తి కలగడంతో పాటు స్వర్గానికి చేరుతారని ముస్లింల నమ్మకం. రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాల అనంతరం షవ్వాల నెల ఒంక కనిపించగానే ముస్లింలు ఉపవాసదీక్షలను విరమించి మరుసటి రోజు ఈదుల్ ఫితర్ పండుగను జరుపుకొంటారు.
రంజాన్ నెలలో జకాత్, ఫిత్రాదానం
రంజాన్ నెలలో జకాత్, ఫిత్రా దానాలు అత్యంత ప్రత్యేకత. ధనికులు తమ ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. ఏడాది కా లంలో మిగిలిన తన సంపద నుంచి 30శాతం చొప్పున ధన, వస్తు, కనకాల రూపంలో రంజాన్ నెలలో జకాత్ పేరుతో నిరుపేదలకు దానాలు చేస్తుంటారు.
పేదలకు ఎం త మేర దానం చేస్తే అందుకు రెండింతలు సంపాదనను అల్లాహ్ సమకూరుస్తారన్న నమ్మకం. అదే విధంగా రం జాన్ పర్వదినం రోజున ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లే ముందుగా ఫిత్రా దానం చేస్తుంటారు. రంజాన్ ఉపవాసదీక్షలు విజయవంతం ముగిసినందుకు భగవంతుడికి కృతజ్ఞతగా పేదలకు ఫిత్రాదానం చేస్తారు. ఫిత్రాదానంలో 50 గ్రాములకు తక్కువ కాకుండా రెండు కిలోల గోధుమలు, ఆహారధాన్యాలు, దానికి సమానమైన డబ్బు రూపంలో పేదలకు అందజేస్తారు.