నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్ టౌన్: రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతోపాటు వెంటనే గుర్తొచ్చేది హలీం.. ముస్లింలకు ఇఫ్తార్‌విందులో ప్రముఖ వంటకమైన ఈ హలీం మతాలకతీతంగా ప్రతిఒక్కరికీ ఇష్టమైన స్నాక్‌గా మారిపోయింది. రుచితోపాటు పౌష్టికత కలిగిన హలీంను ప్రజలు లొట్టలేసుకంటూ తింటారు. రంజాన్ మాసం కావడంతో సాయంత్రం వేళల్లో పట్టణాల్లోని బేకరీలు, టీ హోటళ్లతోపాటు పలు ప్రాంతాల్లో హలీం కేంద్రాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో హలీం ప్రత్యేకత గురించి..
హలీం యమ టేస్టీ..
రంజాన్ ముస్లింల పవిత్ర మాసం. నెల రోజులపాటు ఉపవాస దీక్షలు చేస్తూ 24గంటల పాటూ అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. అలాంటి ముస్లింలకు ఉపవాసదీక్ష విరమణలో ముఖ్యమైన వంటకంగా హలీం నిలుస్తోంది. దీంతో రంజాన్ వచ్చిందంటే ముస్లింలతోపాటు హిందువులు మతాలకతీతంగా హలీం తినేందుకు ఎదురు చూస్తుంటారు. ఎట్టకేలకు రంజాన్ మాసం రావడంతో హలీం కేంద్రాలన్నీ సందడిగా మారాయి. హలీమ్ ఎంతో రుచికరంగా ఉంటూ శక్తినీ, ఆరోగ్యాన్నీ అందిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండటంతో కోల్పోయిన శక్తిని హలీం ద్వారా తిరిగి పొందవచ్చు. ఈ వంటకాన్ని అరేబియన్స్ తీసుకు రాగా దీనిని హరీస్ అని కూడా పిలుస్తారు. పదో శతాబ్దంలో కితాబ్ అల్ తబిక్(వంటల పుస్తకం)లో తొలిసారిగా ఈ విషయాన్ని రాశారు. హైదరాబాద్ నిజాం ఆర్మా దగ్గర ఉండే అరేబియన్ సైన్యం హలీంను మన దేశంలోకి తీసుకొచ్చింది. హలీంను చికెన్, మటన్‌తో తయారుచేస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ వంటి మహానగరానికే పరిమితమైన ఈ ఇరానీ వంటకం.. నేడు అన్ని పట్టణాలకు విస్తరించింది. ఇందులో గోధుమలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, శనగపప్పు, మినపప్పు వేస్తారు. అలాగే మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, కుంకుమపువ్వు, బెల్లంతోపాటు డ్రై ఫ్రూట్స్ పిస్తా, జీడిపప్పు, అంజీరా, బాదం పప్పు వేస్తారు. ఇలా తయారు చేసిన వేడివేడి గ్రేవీలో కొత్తిమీర, ఫ్రైడ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్క వేసి తింటే ఆ రుచి వేరుగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి 6 నుంచి 8గంటల సమయం పడుతుంది. కేలరీలు అధికంగా ఉండే హలీం ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా తక్షణమే శక్తినిస్తుంది. మటన్, డ్రై ప్రూట్స్, ప్రొటీన్ అధికంగా ఉన్న ఈ ఆహారంలో గోధుమలు చేర్చడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగై కండరాలకు శక్తి లభిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల అధిక రక్తపో టు, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారమని చెప్పొచ్చు. ప్రతి 100గ్రాముల హలీంలో 157 క్యాలరీలు, 9.7గ్రాముల ప్రొటీన్, 6.86గ్రాముల కొవ్వు పదార్థం, 15.2గ్రాముల పిండిపదార్థాలుంటాయి. విటమిన్ ఏ, ఈలు, యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. హలీం ధర రూ. 70నుంచి ప్రారంభమవుతుండగా ఆయా ప్రాంతాలోలను బట్టి పలు ఆఫర్ల ద్వారా ఒక్కో ధరకు విక్రయిస్తున్నారు. చికెన్‌తో చేసే హలీంకు, పొట్టేలు మాంసంతో తయారు చేసే హలీంను ప్రత్యేక ధరల్లో విక్రయిస్తుంటారు. మటన్ హలీంను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఇంత శ్రేష్టమైన హలీం రుచి చూసేందుకు చాలామంది హైదరాబాద్‌కు వెళ్లొస్తుంటారు.
జోరుగా అమ్మకాలు..
మహబూబ్‌నగర్‌లోనే దాదాపు 40కిపైగా విక్రయకేంద్రాలు ఏర్పాటు చేశారు. మటన్ హలీం ప్లేట్ రూ.200 నుంచి రూ.270 వరకు, చికెన్ హలీం రూ.60 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. రూ.250 హలీం కొంటే మరో ప్లేట్ ఉచితం అనే ఆఫర్లతో అమ్మకాలు జోరందుకున్నాయి.
40 ఏళ్ల నుంచి విక్రయిస్తున్నాం..
40 ఏండ్ల నుచి మా కుటుంబం హోటల్‌తోపాటు హరీస్ సెంటర్ నడుపుతోంది. మటన్ హరీస్ ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తున్నాం. రెండెండ్లుగా కరోనాతో ఆర్థికనష్టం వచ్చింది. ఈ ఏడాది హరీస్ సెంటర్లు పెరగడంతో మరింత పోటీ పెరిగింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోనే ధరలు ఉన్నాయి.
– మహ్మద్ బురాన్, నాయాబ్ హరీస్ సెంటర్, మహబూబ్‌నగర్