వంగూరు, డిసెంబర్ 28 : అప్పుల పేరుతో తెలంగాణ ఖ్యాతిని కాంగ్రెస్ ప్రభుత్వం బజారు కీడుస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. వంగూరు మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రుణమాఫీ పొందిన వారు వెంటనే రూ.2లక్షలు బ్యాంకు లో రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ 9న మాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇంతవరకు మాఫీ చేయకుండా రైతులను మోసం చే స్తున్నాడన్నారు. యాసంగిలో ఇంతవరకు రైతుబంధు వేయకుండా వారిని అప్పులఊబీలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం కేవలం ఎంపీ ఎన్నికల కోసమే అని అన్నారు.
పేరుకు మాత్రమే ప్రజాపాలన అని, పాలన మొత్తం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల చేతిలోనే ఉందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు ఢిల్లీలో ప్రధాని మోదీ ముందు మోకరిల్లినా ఇంతవరకు సమాధానం రాలేదని ఎద్దేవా చేశారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ అందరినీ సమానంగా చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాల్లో అరాచకాలకు తెరలేపారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వ్యతిరేకతను మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు గణేశ్‌రావు, రాజారంగారావు, నర్సింహారెడ్డి, జంగ య్య, సూర్యనాయక్, సత్యం, జీవన్, రాజు పాల్గొన్నారు.