అయిజ, జనవరి 27: అశేష భక్తుల గోవింద నామస్మరణ, మంగళవాయిద్యాలు, పటాకుల ధ్వనుల మధ్య ధన్వంతరి వేంకటేశ్వరస్వామి రథోత్సవం రమణీయంగా జరిగింది. మండలంలోని ఉత్తనూరులో ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12 గంటలకు నిర్వహించిన శ్రీవారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన రథోత్సవంపై శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆశీనులై భక్తులను అనుగ్రహించారు. రథోత్సవంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకొని తన్మయత్వం చెందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ధన్వంతరి వేంకటేశ్వరస్వామి గజవాహనంపై విహరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
మండలంలోని టీటీదొడ్డిలోని గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.