Tikka Veereswara Swami | అయిజ, ఫిబ్రవరి 16: అయిజ పట్టణంలోని తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిక్కవీరేశ్వరస్వామికి చట్టసేవ వైభవంగా నిర్వహించారు. తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవాలకు నాంది పలికారు. శనివారం రాత్రి మొండి సట్టంపై ఆశీనులై తిక్కవీరేశ్వరస్వామి భక్తులను కటాక్షించారు. నందికోల సేవ, భాజా భజంత్రీలు, రంగు రంగుల పటాకుల మోతల నడుమ తిక్కవీరేశ్వరస్వామి చట్టసేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భక్తుల శివ నామస్మరణ మధ్య తిక్కవీరేశ్వరస్వామి ఆలయం నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆంజనేయస్వామికి భక్తుల ప్రత్యేక పూజల అనంతరం తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి ప్రభోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక వంశీయులు పాగుంట లక్ష్మిరెడ్డి, ఆలయ కమిటీ పాల్గొన్నారు.
తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 11.25 గంటలకు తిక్క వీరేశ్వరుడు రథోత్సవంపై ఆశీనులై భక్తులను అనుగ్రహించనున్నారు. రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సకల ఏర్పాట్లు చేస్తున్నది. రథోత్సవం సందర్భంగా సంప్రదాయ బద్ధంగా పలకల కోలాటాలు, కట్టె కోలాటాల ప్రదర్శన, బీరప్ప డోళ్ల ప్రదర్శన, భాజా భజంత్రీలు, మేళ తాళాలు, భక్తుల శివ నామస్మరణ, పటాకుల మోతల నడుమ రథోత్సవం నిర్వహణకు ఆలయ కమిటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం రథోత్సవాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రథోత్సవం చూసి తన్మయత్వం పొందేందుకు జిల్లా నలుమూలల నుంచేకాక ఏపీలోని కర్నూల్, కర్ణాటక నుంచి భక్తులు తరలిరానున్నారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సీఐ టాటాబాబు, ఎస్సై శ్రీనివాసరావు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.