నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనూ తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహించారు. పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలు వేసి అమరులకు నివాళులర్పించారు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏండ్ల సుధీర్ఘ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. పోరాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపినట్లు వారు వివరించారు.