మూసాపేట, ఏప్రిల్ 6: అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. సగం పంటలు సాగునీరు అందక ఎండిపోగా, మరికొంత పంట వడగండ్ల వానతో పంట పొలంలోనే ధాన్యం రాలిపోయింది. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం ఆదివారం ఆరబెట్టగా.. అకాల వర్షం రావడంతో మొత్తం తడిసి ముద్దయింది.
అరబెట్టిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా కాపాడుకోవడానికి అన్నదాతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. మూసాపేట మండల కేంద్రంతోపాటు, వేముల, తుంకినిపూర్, జానంపేట, కొమిరెడ్డిపల్లి, సంకలమద్ది తదితర గ్రామాల్లో రైతులు వరిధాన్యం ఆరబెట్టారు. మధ్యాహ్నం తర్వాత వర్షం ఒక్కసారిగా రావడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షానికి కొట్టుకుపోయింది. ధాన్యం తడిసిపోవడంతో రై తులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వంగూరు, ఏప్రిల్ 6: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో వంగూరు మండల కేంద్రానికి చెందిన ఈరటి లక్ష్మయ్య వ్యవసాయ పొలంలో కట్టేసిన ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. ఆవు విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని రైతు లక్ష్మయ్య బోరున విలపించాడు.