Paddy Procurement | మాగనూరు, ఏప్రిల్ 18 : ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటి సగం పంట నష్టపోగా, వచ్చిన కాస్తో, కూస్తో పంటలను అమ్ముకుందామంటే గన్నీ బ్యాగులివ్వరు.. ఇచ్చి కొనుగోలు చేసినా లారీల్లో తరలించక రైతులు నరకం అనుభవిస్తున్నారు. మాగనూర్, కృష్ణ ఉమ్మడి మండలాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైస్‌మిల్లుల క్వాంటిటీ ముగియడంతో మూడు రోజులుగా కొనుగోలు పూర్తిగా నిలిపివేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైస్‌మిల్లుల యజమానులకు వెయ్యి నుంచి 5వేల క్వింటాళ్ల వరకు మాత్రమే రైస్‌మిల్లర్లతో సేకరించేలా ఒప్పందం చేసుకోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. రైస్ మిల్లులకు క్వాంటిటీ పూర్తి కావడంతో వరి ధాన్యం అమ్మిన రైతులు గన్ని బ్యాగులో నింపుకొని వరి కొనుగోలు కేంద్రాల వద్ద గత మూడు రోజులుగా ఎప్పుడు మిల్లులకు తరలిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఓ పక్క రైతులు వరి ధాన్యం ఆరబెట్టి మ్యాచరు వచ్చినా చూసేవారు లేక అధికారులు ఎప్పుడు కొంటారని ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క టోకెన్లు ఇచ్చినా గన్నీ బ్యాగులు ఇవ్వలేని పరిస్థితి అధికారులకు నెలకొంది. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వరి కుప్పల వద్ద కాపలాకాస్తు వరి ధాన్యం తడవకుండా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాగనూరు మండలం అమ్మపల్లిలో ఇప్పటివరకు ఏ ఒక అధికారి రైతుల వద్దకు వెళ్లి ధాన్యం సేకరిస్తామని చెప్పిన దాఖలాలు లేవు. అడవిసత్యారంలో 30మందికి టోకెన్లు ఇచ్చి గన్నీ బ్యాగులు ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి.
కొల్పూర్ ఐకేపీ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేం ద్రాల్లో గన్నీ బ్యాగులిచ్చి ధాన్యం తూకం చేసి లారీల కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. కొల్పూర్కు చెందిన రైతు భీమప్ప హిందుపూర్ శివారులో ఉన్న సురేశ్వర రైస్ మిల్లుకు ధాన్యం తరలించాడు. మూడు రోజులపాటు రైస్‌మిల్లులో ఉంచి తర్వాత ఒడ్లు సరిగా లేవని తిరిగి పంపించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామీణ వ్యవసాయ అధికారి పరిశీలించిన అనంతరం రైస్ మిల్లుకు పంపితే.. వాటి యజమానులు అనేక కారణాలు చెబుతున్నారని, ధాన్యంలో నాణ్యత లేదని రెండు నుంచి ఐదారు కిలోల తరుగు తీసి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎన్ఆర్ వరి ధాన్యం కొనుగోలుకు మిల్లు యజమానులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కావేరి సోనా ధాన్యాన్ని పట్టించుకోవడం లేదని చెప్పారు. కొందరు మిల్లర్లు ఆర్ఎన్ఆర్ వరి ధాన్యమే తీసుకురావాలని తెగేసి చెబుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కావేరి సోనా పండించిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ధాన్యం సేకరణలో మిల్లులకు రెండు నుండి 5 వేల వరకు మాత్రమే క్వాంటిటీ కేటాయించడంపై అధికారుల ఉద్దేశం ఏమిటని నిలదీస్తున్నారు. రైతుల పంటల కొనాలనుకుంటున్నారా లేదా అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రైస్ మిల్ యజమానులకు తక్కువ క్వాంటిటీ కేటాయించడంతో మాగనూర్, కృష్ణ ఉమ్మడి మండల రైతులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని, అధికారులు వెంటనే ఒక్కొక్క రైస్ మిల్లుకు 20 నుండి 30 వేల క్వాంటిటీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల నుంచి వరి ధాన్యాన్ని త్వరగా సేకరించాలని, లేదంటే అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా అధికారులే సేకరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంపై సివిల్ సప్లయ్ డీఎం సైదులును వివరణ కోరగా వరి కొనుగోళ్లు కొనసాగుతాయని, ఒక్కొక్క మిల్లుకు ఒక్కొక్క విధంగా కేటాయించడం జరిగిందన్నారు. రైస్ మిల్లుల క్వాంటిటీ అయిపోతే మళ్ళీ యధావిధిగా కొనసాగిస్తామన్నారు. గన్ని బ్యాగులు సరిపడేంతగా ఉన్నాయని, అధికారులతో మాట్లాడి మరిన్ని బ్యాగులు పంపించేలా చర్యలు చేపడతామన్నారు.