మహబూబ్‌నగర్, జూన్ 10 : సమైక్య రాష్ట్రంలో దివ్యాంగులు మాపై దయచూపండి అంటూ మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని.. నేడు అడగకముందే వరాలు ఇస్తున్న సీఎం కేసీఆర్ మా దేవుడని దివ్యాంగులు అంటున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దివ్యాంగులకు రూ.వెయ్యి పింఛన్ ప్రభుత్వం పెంచడంతో శనివారం సమీకృత కలెక్టరేట్ వద్ద దివ్యాంగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి వారితో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో రూ.500 ఉన్న పింఛన్ అడగకముందే సీఎం కేసీఆర్ రూ.3,016 చేసి అండగా నిలిచారన్నారు. మరోమారు పెంచి రూ.4,116 అందిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగుల భవన్ నిర్మించేందుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు యాదమ్మ, ఉపాధ్యక్షుడు రవికుమార్, జనరల్ సెక్రటరీ అంజయ్య, నర్సింహులు, యాదయ్య, కృష్ణ, నరేందర్, శంకర్‌నాయక్, మధు పాల్గొన్నారు.