మహబూబ్‌నగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విధులను నిర్లక్ష్యం చేస్తూ.. మద్యం టెండర్లలో పాల్గొని లక్కీడిప్‌లో వైన్‌షాపు ద క్కించుకున్న ప్రభుత్వ పీఈటీ పుష్పను సస్పెన్షన్ చేస్తూ శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ‘మద్యం వ్యాపారంలో ఉ పాధ్యాయిని.. విద్యాశాఖలో మద్యం కిక్కు’ అంటూ ‘నమస్తే తెలంగాణ’లో రెండు రోజులుగా వస్తున్న వరుస కథనాలకు స్పందించిన అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేయడం గమనార్హం. జిల్లా కేం ద్రంలోని రాంనగర్ కాలనీ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప మహబూబ్‌నగర్ ఎక్సైజ్ శాఖ ఇటీవల నిర్వహించిన మ ద్యం టెండర్లలో 16వ నెంబర్ షాపునకు రూ.3లక్షలతో టెండర్ వేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన లక్కీడిప్‌లో పుష్పకు వైన్‌షాప్ వరించింది.
సా క్షాత్తు కలెక్టర్ చేతుల మీదుగా నిర్వహించిన లక్కీడిప్‌లో పీఈటీ పుష్పకు వైన్‌షాప్ దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, ఈనెల 28న వైన్‌షాపు కోసం ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించి రూ.11లక్షల లైసెన్స్ ఫీజును చెల్లించింది. ఈ మేరకు లైసెన్సీ హోల్డర్‌గా ఆమెకు అధికారులు ఉత్తర్వులు సైతం అందించారు. ఈ వ్యవహారంపై కొంతమంది కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. ఈలోగా అధికార పార్టీ నేతలు ఎంటర్ కావడం.. వైన్‌షాప్‌లో పార్ట్నర్షిప్ ఖరారు కావడంతో చర్యలు తీసుకోకుండా అధికారులకు ఒత్తిళ్లు పెరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పీఈటీకి వైన్‌షాప్ ఇవ్వడంపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరస కథనాలు వెలువడ్డాయి. సీసీఎస్ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగి లిక్కర్ టెండర్లలో పాల్గొనరాదని నిబంధనలున్నాయి. ఈ నిబంధనలపై డీఈవో విచారణ చేసి ఎంఈవో అందించిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప మద్యం టెండర్లలో పాల్గొనడం, లక్కీడిప్‌లో వైన్‌షాప్ అలర్ట్ కావడం.. లైసెన్స్ ఫీజు చెల్లించడంతో ఆమెకు ఎక్సైజ్ శాఖ వైన్‌షాప్ లైసెన్స్ జారీ చేసింది. వైన్‌షాప్ దక్కించుకున్న వారు కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురంలో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి షాపును నెలకొల్పాలి. ఇందుకు సంబంధించి ఎక్కడ నెలకొల్పుతున్నారు.. సదరు ఏరియా గురించి ఎక్సైజ్ శాఖకు ముందస్తుగానే తెలిపి అనుమతులు తీసుకొని వైన్‌షాప్ పెట్టాలి. ఇదంతా ప్రాసెస్ చేసుకొని వైన్‌షాపు తెరిచి ఒకటో తారీఖు నుంచి మ ద్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా టెండర్ వేసి లక్కీడిప్‌లో దక్కించుకున్న పీఈటీ వైన్‌షాప్‌ను సస్పెండై కూడా రద్దు చేసుకోకపోవడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ రద్దు చేసుకోకపోతే సస్పెన్షన్ పీరియడ్‌లో వస్తున్న సగం జీతం కూడా ఇవ్వరు. టెండర్ దక్కించుకున్న దరఖాస్తుదారుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లైసెన్సు ఇతరుల పేర్లపై మార్చడానికి వీల్లేదని ఎక్సైజ్ పాలసీ చెబుతు న్నది. ఒకవేళ సస్పెండై కూడా వైన్‌షాప్ నిర్వహిస్తే సీసీఎస్ సర్వీస్ రూల్ ప్రకారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే అవకాశాలు లేకపోలేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దుకాణం రద్దు చేసుకుంటారా? లేక ఉద్యోగానికి గుడ్‌బై చెబుతారా? అనేది ఉత్కంఠగా మారింది. వైన్‌షాపు రద్దు చేసుకుంటే జరిమానా లేకుండా రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని.. ఎక్సైజ్ కమిషనర్ విచక్షణ అధికారంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కొత్త ఎక్సైజ్ పాలసీ ఏర్పాటు చేసిన తర్వాత ఓ ప్రభుత్వ ఉద్యోగి మద్యం టెండర్లో పాల్గొనడం, అనూహ్యంగా లక్కీడిప్‌లో అదృష్టం వరించడం ఇదే మొదటిసారి. మొత్తంపైన ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పీఈటీ టాపిక్ ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.