గద్వాల, మే 2 : ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రస్తుతం వాటిని అమలు చేయడం భారం కావడంతో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిబంధనల పేరుతో తొలగించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ దిశగా ప్రణాళిక రూపొందించింది. త్వరలో బడుగుల సంక్షేమ పథకాలను సర్కారు కత్తితో కోయనున్నది. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను డబుల్ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నిబంధనల పేరుతో ఉన్న వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టడంతో చాలామంది అర్హులుగా ఉన్న వారు సంక్షేమ పథకాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. గ్రామాల్లో అధికారులు రెండునెలల కిందట విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడంతో ప్రస్తుతం పింఛన్, రేషన్ కార్డులు పొందుతున్నవారు ఎవరి రేషన్‌కార్డు, పింఛన్ ఉడుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
గ్రామాల్లో విచారణ చేసిన నాటి నుంచి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి కొరివి తెచ్చుకున్నట్లుందని మదన పడుతున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు కేంద్రం నిబంధనలు అనుసరించి ఉన్న కార్డులు కోత పెట్టడానికి సిద్ధమైంది. ఐటీఆర్ చూపిస్తున్న ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండి రేషన్, పింఛన్ ఉన్న వాళ్ల వివరాలతో పాటు వ్యవసాయ భూములు ఉండి సంక్షేమ పథకాలు పొందుతున్న వారి వివరాలు ఇప్పటికే సివిల్ సప్లయ్, ఎంపీడీవోలు, రెవెన్యూశాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనల పేరుతో..
ఐటీఆర్, ఎక్కువ పొలం, ప్రభుత్వ ఉద్యోగం ఉందనే సాకుతో రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 13మండలాలు 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,81,352 రేషన్‌కార్డులు, 68,344మంది పింఛన్లు అందుతున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం నిబంధనల పేరుతో రేషన్, పింఛన్లు తొలగించడానికి సిద్ధం కాగా వేల సంఖ్యలో తొలగించే అవకాశం ఉంది. అందులో భాగంగా ఐటీఆర్ సబ్మిట్ చేసిన వారికి రేషన్‌కార్డు ఉందా లేదా అనేదానిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయించింది. అధిక ఆదాయంతో పన్ను కట్టేవారికి రేషన్‌కార్డు అవసరం లేదని చెప్పి కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దీంతో పాటు మూడున్నర ఎకరాల తరి, ఏడున్నర ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్న వారిని ప్రభుత్వం గుర్తించింది.
త్వరలో వారికి ఇండ్లలో పింఛన్లేదా రేషన్ కార్డు ఉన్న వారిని తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే గ్రామాల్లో విచారణ చేయించారని తెలుస్తోంది. ఇప్పటికే సివిల్ సప్లయ్ అధికారులు రేషన్‌కార్డుల జాబితా, మండల అభివృద్ధి అధికారులు పింఛన్ల జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారని సమాచారం. త్వరలో కోత విధించే అవకాశం ఉందని సర్వేచేసిన అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ రెండు వర్గాల ప్రజలు దాఖలు చేస్తారు. పన్ను పరిధిలోకి వచ్చేవారు ఒకరైతే, మరో వర్గం పన్ను పరిధిలోకి రాని సామాన్యులు. ట్యాక్స్ పరిధిలోకి రానప్పటికీ గృహరుణాలు, పర్సనల్ రుణాలు, ఇతర ఆర్థిక అవసరాల కోసం ఐటీఆర్ ఉపయోగపడుతుందనే ఆశతో ఐటీ రిటర్న్‌కు దాఖలు చేస్తారు.
ఐటీఆర్ సబ్మిట్ చేస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు తొలగించడానికి ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి సామాన్య కుటుంబాలకు ఆదాయం కలిగిన కుటుంబాలుగా చూపిస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి గ్రామంలో 10దాకా రేషన్, పింఛన్‌కార్డులు తొలగిపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 255 పంచాయతీలు ఉండగా పంచాయతీకి 10తొలగించిన సుమారు 2550 వరకు తొలగించే ప్రమాదం ఉంది. బుక్కెడు బువ్వ, వృద్ధులకు ఆసరాగా ఉన్న పింఛన్లు తీసుకొనే సామాన్య కుటుంబాలపై నిబంధనల సాకుతో వారికి వచ్చే సంక్షేమ పథకాలు రద్దు చేసే ప్రయత్నం చేయడంపై పేదల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు మాను కొని ప్రజలకు మేలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు.