వనపర్తి టౌన్, డిసెంబర్ 22 : వ్యక్తిగత కీర్తి కోసం తాను పనిచేయలేదని భావితరాల భవిష్యత్‌కు విద్యనందించి అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేశానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా కళాశాల 50వ వసంతోత్సవాలను నిర్వాహక కమిటీ నిర్వహించింది. ముందుగా కళాశాలను స్థాపించి విద్యాబుద్ధులు అందించిన మహానీయులు రాజారామేశ్వరరావు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయరాములు, డాక్టర్ బాలకిష్టయ్య, టైప్ కృష్ణయ్య కుటుంబ సభ్యులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్నానించారు. అనంతరం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామనుజన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ అక్షరం పుట్టి లిపిగా రూపం దాల్చి గ్రంథాలుగా అవతరించాయని అలాంటి ప్రపంచ గ్రంథాలను అధ్యాయనం చేసిన మహానీయులు ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు ఉన్నారని వారిలో కారల్ మార్క్స్ ఒకరు, ఇటలీ తత్వవేత్వ మజీన్ మే, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఒకరని గుర్తుచేశారు.
ఈ కళాశాలలో తాను చదవకపోయిపా కళాశాలతో అత్యంత అనుబంధం ఉందన్నారు. నేను చదివిన రోజుల్లో మా మామయ్య మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య కళాశాలకు అభివృద్ధికి ప్రభుత్వపరంగా కృషి చేశారన్నారు. వనపర్తి నియోజకవర్గాన్ని విద్యలో అగ్రభాగంలో నిలపడానికి చిన్నారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నేను పోటీపడి పనిచేశామన్నారు. పేద విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించడానికి ఉన్నత విద్య అవకాశాలు కల్పించడానికి నాటి నుంచి నేటి వరకు విశేషంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశలో ఉన్నత విద్య హబ్‌కు ఏర్పాటు చేస్తే రెండు తరాల అభివృద్ధి జరుగుతుందని భావించి వనపర్తికి బీసీ డిగ్రీ గురుకుల కళాశాల మంజూరైతే మంత్రిగా ఉండి అగ్రికల్చర్ కళాశాలను తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటి కళాశాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్, ఫిషరీష్, ఫిషరీస్ పీజీ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి మౌలిక సదుపాయాల కల్పన కోసం అప్పటి ప్రభుత్వంలో స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేశానని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు బాటలు వేసేందుకు చిరస్థాయిగా ఈ ప్రాంత వైభవాన్ని నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలని అందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముందుగా కళాశాల గురువులను , బోధనేతర సిబ్బంది, శాలువా, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం 50వసంతాలు సావనీరును ఆవిష్కరించారు. అదేవిధంగా నిర్వాహకులను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ వసంత ఉత్సవాల్లో 2500 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కళాశాలలో చదువుతున్న ప్రస్తుత విద్యార్థులు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం డిగ్రీ కళాశాల ఉత్సవాలకు కలెక్టర్ ఎస్పీ, తెలంగాణ ఎలక్ట్రిసిటి నియంత్రణ కమిటీ చైర్మన్ జస్టిస్ దేవరాజుల నాగార్జున, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974లో స్థాపించిన ప్రభుత్వ కళాశాలలో ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఎదిగారని, అందులో జేసీ లక్ష్మీనారాయణ, ఆర్జేడీ రాజేంద్రసింగ్ లాంటి వారు ఎంతో మం ది ఉన్నారని గుర్తుచేశారు. పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని కళాశాల అభివృద్ధికి విద్యావంతులు, మేధావులు విరాళాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్, సభాద్యక్షుడు శ్రీనివాసులు, మాజీ అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాసులు, సమన్వయకర్త బాలస్వామి, వెంకటేశ్వరరావు , కిరణ్‌కుమార్, వాకిటి శ్రీధర్, ఆర్యభవన్ శ్రీను ఉన్నారు.