గోపాల్పేట, సెప్టెంబర్ 8 : మండలంలోని బుద్ధారంగండి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఎలుకలు కరపడంతో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాలలో పదో తరగతికి చెందిన ఏడుగురు విద్యార్థులు ఆదివారం రాత్రి భోజనాలు చేసిన తర్వాత వారి గదిలో నిద్రిస్తుండగా ఎలుకలు వారికి కాళ్లు చేతులను కొరికి గాయపరిచాయి. నిద్రనుంచి తేరుకున్న విద్యార్థునులు పాఠశాల సిబ్బందికి తెలిపారు.
సోమవారం విద్యార్థినుల హెల్త్ చెకప్ చేసేందుకు వచ్చిన ఆరోగ్య సిబ్బందికి చూపించిన ప్రిన్సిపాల్ ఆరోగ్యం వారి సూచన మేరకు గోపాల్పేట పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది వారికి వైద్య చికిత్సలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ తదితరులు బీఆర్ఎస్ నాయకులు దవాఖానకు వద్దకు చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకుల పాఠశాలలను గాలికి వదిలి వేయడంతో కనీస వసతులు కరువై, విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను లోపలికి అనుమతించడం లేదని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవని విద్యార్థినులు ఆందోళనకు గురికావద్దని ధైర్యం చెప్పారు.