
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 21: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లాలోని పేద క్రైస్తవులకు సర్కారు కానుకలు పంపింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మొత్తం 3వేల గిఫ్టులు చేరుకున్నాయి. వీటిని ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని తాసిల్దార్లకు మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు అందజేశారు. వీటిని మండలాల వారీగా అధికారులతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్స్ కమిటీ (సీసీవోసి) ఆధ్వర్యంలో ఆయా చర్చీల నిర్వాహకులు గుర్తించిన పేదలకు పంపిణీ చేయనున్నారు.
పేద క్రైస్తవులకే గిఫ్ట్ ప్యాకెట్
జిల్లాలోని 3వేల మంది పేద క్రైస్తవులకు మాత్రమే సీఎం కేసీఆర్ గిఫ్ట్ ప్యాకెట్లను అందజేయనున్నారు. ఈ ప్యాకెట్లో ఒక చీర, పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్ట్ ఉంటాయి. కుటుంబంలోని తల్లిదండ్రులు, కుమారైకు ఈ దుస్తులను ప్రభుత్వం అందజేస్తున్నది.
పంపిణీకి సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం ఏటా పేద క్రైస్తవులకు పంపిణీ చేసే కానుకలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని అధికారులు ఆయా నియోజకవర్గ కేంద్రాలకు ఇదివరకే పంపించారు. పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.