కల్వకుర్తి/ఊర్కొండ, ఏప్రిల్ 18 : ఊర్కొండపేటలో గ్యాంగ్‌రేప్ నిందితులను కోర్టు శుక్రవారం పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఐదురోజుల పాటు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ఊర్కొండ మండలం ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయ సమీపంలో మార్చి 28వ తేదీన వివాహితపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఊర్కొండపేటకు చెందిన 7మంది యువకులపై పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణను వేగవంతం చేశారు. మరింత సమగ్రంగా విచారణ అవసరం ఉందని నిందితులను కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. సానుకూలంగా స్పందించిన కోర్టు నిందితులు ఏడుగురిని 5రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. విచారణలో భాగంగా తొలిరోజు నిందితులను ఊర్కొండపేటకు తీసుకొచ్చారు. ఘటన జరిగిన ప్రాంతానికి నిందితులను తీసుకొచ్చిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించనట్లు సమాచారం. కొత్త విషయాల ఆధారంగా మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని మండలంలో జోరుగా చర్చ వినిపిస్తున్నది.