మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 1: పూజలు చేస్తే డబ్బులు, బంగారం పెరుగుతాయని నమ్మబలికి, సినీ ఫక్కీలో మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పాలమూరు ఎస్పీ నర్సింహ తెలిపారు. మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు వివారాలను ఎస్పీ వెల్లడించారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాములపాడు మండలం, బానుముక్కల గ్రామానికి చెందిన చెంచు రంగస్వామి (ఎ1), అతడి భార్య చెంచు భార్గవి (ఎ2) విష్ణు, మూల శేఖర్, గడ్డం విజయ్‌కుమార్, గడ్డం ప్రదీప్, గడ్డం దివాకర్‌లతో కలిసి మాయమాటలు చెప్పి సులభంగా డబ్బులు సంపాదించాలను ఉద్దేశంతో మోసాలకు పాల్పడేవారు. ఈక్రమంలో పాలమూరు జిల్లాలోని మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ముఖ్తాల వివేకానందగౌడ్తోపాటు కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామానికి చెందిన వెల్జర్ల మహేశ్, తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామానికి చెందిన తింగిరికార్ నరేశ్, నిదురమ్ శేఖర్, రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన జంగయ్యతో ఉన్న పాత పరిచయాలను పెంచుకొని అధికమొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మబలికారు. 10 నెలలుగా ఏపీ ముఠా వీరితో సన్నిహితంగా ఉంటూ డబ్బులను కుప్పలుగా పోసి పూజలు చేస్తే రెట్టింపవుతుందని.. ఇత్తడి చెంబుకు పూజలు చేస్తే బంగారు చెంబుగా మారుతుందని వీడియోల రూపంలో బాధితులకు చూపించారు. పైన తెలిపిన నలుగురు బాధితుల నుంచి వేరు వేరు మార్గాల్లో ముఠా సభ్యులు రూ.71లక్షల 50వేలు పలుమార్లు తీసుకొని పరారయ్యారు.
ఈక్రమంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా శనివారం ఉదయం మిడ్జిల్ పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా చెంచు భార్గవి, విష్ణు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.71లక్షల 50వేలతోపాటు మూడు కార్లను స్వాధీనం చేసుకోగా వారు కొనుగోలు చేసిన నాలుగెకరాల భూమిని జప్తు చేశామన్నారు. ఈమేరకు కేసును ఛేదించిన జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప, మిడ్జిల్ ఎస్సై రాంలాల్, సీసీఎస్ ఎస్సై శ్రీనివాస్, బాలనగర్ ఎస్సై జయేంద్రప్రసాద్, కానిస్టేబుళ్లు వెంకటేశ్, బాలచంద్రుడు, నానూనాయక్, పర్వతాచారి, రాజేశ్వరి, మల్లేశ్, ప్రవీణ్‌ను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో మహబూబ్‌నగర్ డీఎస్పీ మహేశ్, సీసీఎస్ డీఎస్పీ లక్ష్మణ్ పాల్గొన్నారు.
కష్టపడితేనే డబ్బులొస్తయ్: ఎస్పీ
మాయలు, మంత్రాలు, పూజలు చేస్తే డబ్బు వస్తుందని చెప్పే ముఠాలతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అటువంటి వారు కనిపిస్తే వెంటనే డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కష్టపడితే వచ్చే డబ్బులనే నమ్మాలి కానీ మాయమాటలకు మోసపోవద్దని సూచించారు.