గద్వాల, ఆగస్టు 20 : రుణమాఫీ అయిన రైతులు తిరిగి బ్యాం కుల్లో మళ్లీ రుణం తీసుకుంటుంటే రుణమాఫీ వర్తించని రైతులు మాకెందుకు రుణమాఫీ కాలేదు అంటూ బ్యాంకులు ఇటు పీఏసీసీఎస్ కార్యాలయాలు, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అర్హులైన బ్యాంకుల్లో రు ణాలు తీసుకున్న వారికి అందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రస్తుతం సవా లక్ష నిబంధనలు పెట్టడంతో అర్హత ఉన్నా రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు రైతులకు రుణమాఫీ రాక ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వక సాగుపై అనాసక్తి చూపుతున్నారు. మళ్లీ ఆసాముల దగ్గర అప్పులు తెచ్చుకొనే పాత రోజులు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బ్యాంకర్లు రూ.రెండు లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు రూ.రెండు లక్షలకు పైగా ఉన్న డబ్బులు బ్యాంకులకు చెలిస్తే రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఆ డబ్బులు బ్యాంకుల్లో కట్టడానికి రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొ న్నది. గద్వాల డీసీసీబీ పరిధిలో రైతులు తీసుకున్న వివరాలు, రుణమాఫీ తీరు పరిశీలిస్తే ఎంత మందికి ప్రభుత్వం రుణమాఫీ చేసిందో అర్థమవుతుంది.
గద్వాల డీసీసీబీ పరిధిలో రూ.లక్ష మొదలు రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు 3,522మంది ఉన్నారు. వీరికి రూ.25. 94 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రుణమాఫీ అయిన రైతులు 2081మంది ఉండగా వారికి రూ.13కోట్ల మేర రు ణమాఫీ జరిగింది. ఇంకా రుణమాఫీ జరగాల్సిన రైతులు 1,441 మంది ఉన్నారు. అయితే వీరికి వివిధ కారణాలు చూపుతూ మాఫీ చేయలేదు.
మేము రుణమాఫీకి అర్హత ఉన్నా ఎందుకు మాకు రుణమాఫీ కాలేదని బ్యాంకులు, పీఏసీసీఎస్, వ్యవసాయ కార్యాలయా ల చుట్టూ రైతులు తిరుగుతున్నా అధికారులనుంచి వారికి సరైనా సమాధానం రాకపోవడంతో రైతులకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలప్పుడు ఒక మాట గెలిచినప్పుడు మరో మాట చెప్పడంతో ప్రభుత్వం, ముఖ్యమంత్రి తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి నిబంధనలు లేకుండా రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెసోళ్లు ప్రకటించారు. వారిని నమ్మి ఓట్లేసిన వారికి తగిన బుద్ధి చెప్పారు. ఇప్పడేమో రేషన్‌కార్డు అంటూ.., పేర్లు మ్యాచ్ కావడం లేదంటూ రుణమాఫీకి ఎన్నో కొర్రీలు పెడుతున్నారు. నాకు రూ.2 లక్షల వ్యవసాయ రుణం ఉన్నది. ఒక్క పైసా కూడా మాఫీ కాలేదు. అధికారులను అడిగితే తికమక సమాధానం చెబుతున్నారు. మళ్లీ మళ్లీ తిప్పించు కుంటున్నారు. ఇక మాఫీ అయితదన్న నమ్మకం నాకైతే లేదు.
– బాకారం రమేశ్, రైతు, కుప్పగండ్ల, వెల్దండ మండలం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత లు చెప్పింది ఒక్కటి కూడా చేయలే దు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ వాళ్లు చే సిందైతే శూన్యం. ఒక్క ఊరిలో కూ డా అందరికీ రుణమాఫీ అయినట్లు కనిపించడం లేదు. నేను రూ.75 వే లు రుణం తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.లక్ష దాటింది. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే.
– జల్లెల తిరుపతయ్య, రైతు, కుప్పగండ్ల, వెల్దండ మండలం
ధరూర్ పీఏసీసీఎస్‌లో రూ.రెండున్నర లక్షల రుణం తీసుకున్నాను. అయితే ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రూ.రెండు లక్షల పైనా ఉన్న నగదు చెల్లిస్తేనే రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం పంటల పెట్టుబడికి పైసలు లేని సమయంలో బ్యాంకులు రూ.రెండు లక్షలపైగా ఉన్న నగదు చెల్లించాలంటే మళ్లీ ఆసాముల దగ్గరకు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రెండు లక్షలు రుణమాఫీ చేస్తే తిరిగి లోన్ తీసుకున్న తర్వాత మిగతా డబ్బులు చెల్లిస్తామన్నా అధికారులు ఒప్పుకోవడం లేదు. మా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. – జేడీ సత్యన్న, రైతు, ధరూర్
గద్వాల ఎస్బీఐలో రూ.1.70 లక్షల రుణం తీసుకున్నాను. నాకు మూడు విడుతల్లో రుణమాఫీ కాలేదు. వ్యవసాయశాఖ అధికారుల దగ్గరకు వెళ్తే కుటుంబ నిర్ధారణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.రెండు లక్షలు రుణం తీసుకున్న ప్రతి రైతుకు ఎటువంటి షరతులు, నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం మాట మారుస్తున్నాడు. వీరు చెప్పింది ఒకటి ప్రస్తుతం చేస్తున్నది ఒకటి. ఏది ఏమైనా రూ.రెండు లక్షలు తీసుకున్న ప్రతి రైతుకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. – పీ సత్యన్న, రైతు, కొత్తపాలెం, ధరూర్ మండలం
వనపర్తి యూనియన్ బ్యాంకులో నా భార్యపై రూ.1.20 లక్షలు తీసుకుంటే.. నా పేరుమీద రూ. 1.40 లక్షల రుణం తీసుకున్నాం. ఇద్దరిపై వేర్వేరు గా మూడెకరాల పొలం ఉన్నది. బ్యాంకులో ఇద్ద రి అప్పు కలిపితే రూ.2.60 లక్షలు అవుతుంది. ఈ లెక్కన మాకు రుణమాఫీ వర్తించాలి. నిరుపేద గిరిజన కుటుంబమైన తాము మాఫీ అవుతుందని ఎదురుచూశాం. తీరా మూడో విడుత రుణమాఫీ లో పేర్లు రాలేదు. ఎందుకు కాలేదని బ్యాంకోళ్లను అడిగితే సరైన సమాధానం రావడంలేదు. మేమేం పాపం చేశాం.
– ఇస్లావత్ రూప్లానాయక్. పెద్దగూడెం తండా, వనపర్తి మండలం