వనపర్తి, ఆగస్టు 13 ( నమస్తే తెలంగాణ) : పవర్ బ్రేక్‌డౌన్ నుంచి రైతులకు ఉపశమనం కలగనున్నది. ప్రభుత్వం వనపర్తి జిల్లాకు ప్రత్యేకంగా విద్యుత్ స్టోర్ మంజూరు చేయడంతో కరెంట్ కష్టాలకు చెక్ పడింది. ఈ స్టోర్ ద్వారా వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ప్రయోజనం చేకూరనున్నది. రైతులు సాగు చేస్తున్న క్రమంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, పాడైపోయినా మళ్లీ కొత్తదానిని బిగించాలంటే నానా యాతన పడేవారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌కు వెళ్తేనే మరో ట్రాన్స్ఫార్మర్ తీసుకువచ్చే వీలుంది. పొలం పనులు విడిచిపెట్టి, ఖర్చులతోపాటు, దూరాభారాన్ని భరించాల్సి వచ్చేది. వెళ్లినా ఒక్కోసారి అక్కడి స్టోర్‌లో ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్, ఇతర సామన్లు అందుబాటులో లేకుంటే మళ్లీ మళ్లీ తిరగాల్సి వచ్చేది. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లండని అధికారులు చెప్పినా.. అక్కడికి వెళ్లే లోపు ఏదో ఒక జిల్లాకు అత్యవసరమని తీసుకెళ్తే మళ్లీ తిరిగి వచ్చేవారు. దీంతో సరైన సమయానికి నీరందక పంటలు ఎండిపోవడ మో లేదా దిగుబడి తక్కువగా రావడమో జరుగుతుండేది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం కేసీఆర్‌ను ఒప్పించి జిల్లాకు విద్యుత్ స్టోర్ మంజూరు చేయించారు. దీంతో బ్రేక్‌డౌన్ లేకుండా మోటార్లకు విద్యుత్ సరఫరా అందిచొచ్చు.
విద్యుత్ స్టోర్‌లో పంట పొలాలకు అందించే విద్యుత్ సరఫరాకు సంబంధించి అన్ని రకాల ఉపకరణాలు అందుబాటులో ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, విద్యుత్ వైర్లు, కాసారాలు ఎర్తింగ్‌కు వస్తువులు ఉంటా యి. పొలాల వద్దకు తీసుకువెళ్లేందుకు రవాణా సదుపా యం ఉంటుంది. సగటున ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు అవసరమవుతాయనే లెక్కతో ఇండెంట్ పెడుతున్నారు. సం బంధిత రైతులకు అప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మర్ అం దజేసేలా 24 గంటలూ స్టోర్‌ను తెరిచి ఉంచుతున్నారు.
పంటలు ఎండిపోకుండా ఉంటాయి.
అడిగిన వెంటనే ట్రాన్స్ఫ్రార్మర్, ఇతర ఉపకరణాలు పంపిణీ చేయనున్నారు.
స్థానికంగా ఉండడంతో రైతులకు దూర, వ్యయ భారం ఉండదు.
రవాణా ఖర్చులు తగ్గుతాయి.
కార్యాలయాల చుట్టూ తిరిగే వ్యథ తప్పుతుంది.
మరమ్మతుల వస్తువులు కూడా లభ్యమవుతాయి.