జోగుళాంబ క్షేత్రంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం
శ్రీగిరిలో గజవాహనంపై ఊరేగిన గరళకంఠుడు
నేడు మహాశివరాత్రి
శైవ క్షేత్రాలకు వేలాదిగా తరలిరానున్న భక్తజనం
శ్రీశైలం, ఫిబ్రవరి 28 : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడోరోజైన సోమవారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణాలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంకాలం అర్చన, హోమాల అనంతరం స్వామి, అ మ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన గజ వాహనంపై ఉంచి అక్కమహాదేవి అలంకార మండపం లో షోడశోపచార పూజలు నిర్వహించారు. స్వా మి, అమ్మవారి విగ్రహాలను మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య క్షేత్ర ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఉత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నంది మండపం నుంచి బయ లు వీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం కనుల పం డువగా సాగింది. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామి, అమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. మార్చి 2న రథోత్సవం ఉండనున్నది. ఈ మేరకు సోమవారం ఉదయం రథోత్సవ కలశాన్ని మేళతాళాలతో ఆలయంలోకి తీసుకొచ్చి పూజలు చేసి రథశిఖరానికి అమర్చారు. ఆలయ మాడవీధిలోని భ్రామరీ కళావేదిక, పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. గ్రామోత్సవంలో ఈవో లవన్న, ఈఈ మురళీ, పీఆర్వో శ్రీనివాసరావు, అసిస్టెంట్ నటరాజ్, ఏఈవోలు హరిదాస్, ఫణీంద్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, అధికారులు శ్రీహరి, నర్సింహారెడ్డి, అయ్యన్న, సిబ్బంది పాల్గొన్నారు.
మల్లన్నను దర్శించుకున్న పీఠాధిపతి..
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలం అని శ్రీశైల జగద్గు రు పీఠాధిపతి చెన్నసిద్ద్ధరామ శివాచార్య మహాస్వామి తెలిపారు. ఉదయం క్షేత్రానికి వచ్చిన ఆయనతో కన్నడ భక్తులు ఆశీస్సులు పొందారు. అనంతరం క్షేత్ర పుర వీధుల్లో పల్లకీపై ఊరేగిస్తూ భజన లు చేశారు. ఉభయ దేవాలయాలతోపాటు పరివా ర దేవతలకు ప్రత్యేక పూజలు జరిపించారు.
శ్రీశైలం చేరుకున్న మల్లన్న తలపాగ..
బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవా ర్ల కల్యాణానికి ముందుగా జరిగే పాగాలంకరణ కో సం వడికిన పాగ మల్లన్న సన్నిధికి చేరుకున్నట్లు ఈవో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వా రు నిత్యం మూర చొప్పున వడికి కల్యాణం నాటికి సిద్ధం చేయడం ఆనవాయితీ అని ఆలయ స్థానాచార్యులు పూర్ణానందారాధ్యులు తెలిపారు.
లింగోద్భవ అభిషేకాలకు పండ్లు విరాళం..
హైదరాబాద్‌కు చెందిన పర్వతయ్య, శారద దం పతులు లింగోద్భవ అభిషేకాలకు ఉపయోగించే పండ్లు, డ్రైఫ్రూట్స్లను విరాళంగా అందజేశారు. 3 వేల తమలపాకులు, 500 అరటిపండ్లు, 400 బ త్తాయిలు, 400 కమలాపండ్లు, 400 సపోటపం డ్లు, 35 కేజీల నల్లద్రాక్ష, 35 కేజీల తెల్లద్రాక్ష, 100 చెరుకు గడలు, 150 కొబ్బరిపాల డబ్బాలు, 100 పైనాపిల్స్, 120 యాపిల్, 120 దానిమ్మ, 130 జామపండ్లు, డ్రైఫ్రూట్స్ పీఆర్వోకు అందజేశారు.