జోగులాంబ గద్వాల్: జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TG MDC) ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఇసుక రీచ్‌పై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుండగులు బరితెగించి దాడికి పాల్పడ్డారు. రాడ్లతో బెదిరించి, భారీగా నగదు బుక్కులు ఎత్తుకెళ్లారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు రెండు కార్లలో తుమ్మిళ్ల ఇసుక రీచ్‌కు చేరుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైట్ ఇంచార్జి ఎల్వీ చౌదరిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఇనుప రాడ్లతో చౌదరీని భయభ్రాంతులకు గురిచేసి, ఇసుక రీచ్‌కు సంబంధించిన రికార్డు బుక్కులు, భారీ మొత్తంలో నగదున్న బ్యాగును లాక్కొని పరారయ్యారు.
తుమ్మిళ్ల ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడిలో ప్రధాన నిందితుడిగా ఆడుసుమిల్లి శ్రీధర్.. సూత్రధారిగా గుత్తికొండ ఠాగూర్‌ను గుర్తించారు. రీచ్‌లో టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురైన సైట్ ఇంచార్జి ఎల్వీ చౌదరి మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆడుసుమిల్లి శ్రీధర్ ఉన్నట్లు స్పష్టంగా గుర్తించానని వెల్లడించారు. అంతేకాకుండా. ఈ దౌర్జన్యం వెనుక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న గుత్తికొండ ఠాగూర్ హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఠాగూర్ కనుసన్నల్లోనే పక్కా ప్రణాళికతో తుమ్మిళ్ల ఇసుక రీచ్‌పై దాడి జరిగినట్లు బాధితులు అనుమానిస్తున్నారు.
ఇసుక రీచ్‌లో టీడీపీ దుండగుల దాడితో ప్రాణభయంతో వణికిపోయిన సైట్ ఇంచార్జి, సిబ్బంది వారి బారి నుండి ఎలాగోలా తప్పించుకుని నేరుగా రాజోలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను వేడుకున్నారు. అనంతరం తమపై దాడికి పాల్పడిని నిందితులపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఇసుక రీచ్‌పై ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన దాడి స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అధికారులపై భౌతిక దాడులకు పాల్పడిన ఆడుసుమిల్లి శ్రీధర్, ఇతర దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి వెనుక ఉన్న ‘పెద్ద తలకాయలను’ సైతం వెంటనే విచారించి, అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాజోలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.