Alampur | అలంపూర్: అలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలంలో పెద్దదనివాడ గ్రామంలో పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చు రేగింది. కంపెనీ పనులు మళ్లీ మొదలైన సందర్భంలో రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ నిర్మాణం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. బుధవారం పోలీసులు భారీగా మోహరించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అడ్డుకునే ప్రయత్నంలో కంపెనీ నిర్వాహకులకు రైతులకు మధ్య ఎలాంటి సంఘటన చోటు చేసుకుంటుందోనని ఆందోళనకరంగా ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీ ఏర్పాటుతో సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని, పెద్ద ధన్వాడ గ్రామస్తులతో పాటు ఆలంపూర్ నియోజకవర్గంలోని ఐజ, రాజోలి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టొద్దంటూ గత నాలుగు మాసాల కిందట అలంపూర్ నియోజకవర్గంలోని 12 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి విధితమే. అప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు రైతుల దగ్గరికి వెళ్లి ఫ్యాక్టరీ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని రైతులకు అన్యాయం జరిగే ఏ ఫ్యాక్టరీలను ఇక్కడ నిర్మించడానికి ఒప్పుకోమని రైతుల పక్షాన ఉంటామని చెప్పి రిలే నిరాహార దీక్షను విరమింప చేశారు. ప్రస్తుతం, కంపెనీ యాజమాన్యం అక్కడ పనులు చేపట్టడానికి పూనుకుంది. పనులు చేపట్టడానికి అవసరమైన సామగ్రినంత తరలించి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీన్ని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున రైతులు అక్కడికి వెళ్తున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున తమ బలగాలను మొహరించినట్లు రైతులు చెప్పారు . పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టి ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుంటే రెవెన్యూ, పోలీస్, ప్రజాప్రతినిధులు మాత్రం కంపెనీ యాజమాన్యానికి సహకరిస్తూ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
బుధవారం కంపెనీ యాజమాన్యం పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతుండడంతో, దానిని అడ్డుకోవడానికి రైతులు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ నిర్మించే స్థలం దగ్గరికి చేరుకుంటున్నారు. గతంలో నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో జిల్లా అధికార యంత్రాంగం, పాలక ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలకు నిరసనలు విరమించామని అయితే ప్రస్తుతం మళ్లీ పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారని తాము పాలకుల మాట విని నిరసన విరమింప చేస్తే ఫలితం లేకపోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులను, పోలీసు అధికారులు గ్రామాల్లో బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి పచ్చని పొలాలను నాశనం చేసే ఫ్యాక్టరీని రద్దు చేయించాలని లేనిపక్షంలో ఈ ఆందోళనలు నిరంతరం కొనసాగుతాయని రైతులు హెచ్చరిస్తున్నారు.