గద్వాల రూరల్, ఫిబ్రవరి 6: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ, పరుశరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8నుంచి 16వరకు అంత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ సతీశ్‌కుమార్, ఈవో వీరేశం తెలిపారు. ఈ నెల 8న ఉదయం 11గంటలకు అమ్మవారిని ఆహ్వానించేందుకు గుర్రంగడ్డ దివి గ్రామానికి ఊరేగింపుగా ఎద్దుల బండి తీసుకుని వెళ్లి 9వ తేది ఉదయం 6గంటలకు జమ్మిచేడు దేవస్థానానికి తీసుకు వస్త్తారు. ఇదే సమయంలో కేరళకు చెందిన కళాకారులతో నవదుర్గ వేషధారణతో ఘనంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈనెల 16 వరకు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తూ బుధవారం పౌర్ణమి రోజు అమ్మవారి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, జాతర, పల్లకీసేవ నిర్వహిస్తారు.
అమ్మవారి చరిత్ర..
జమ్మిచేడు గ్రామ శివారులో ఒక రైతు పొలం దున్నుతుండగా గడెం లోతుగా తెగనందున ఆ రైతు బరువు కోసం గడేనికి రాయి వెతకగా పొడవుగా ఉన్న రాయి కనబడింది. ఆ రాయిని నాగలికి అమర్చాడు. అనంతరం సాయంత్రం వరకు దుక్కి దున్ని రాయితో సహా పొలంలోనే గడెం వదిలి ఇంటికి పోయాడు. మరుసటి రోజు దుక్కి దున్నడానికి వచ్చి చూడగా అక్కడ కట్టిన రాయి కనబడలేదు. దీంతో చుట్టు వెతకగా గతంలో తెచ్చిన స్థానంలోనే రాయి ఉండటం గమనించి మళ్లీ ఆరోజు ఇంటికి వెళ్లాడు. మూడో రోజు వచ్చి చూడగా గడేముకు కట్టిన రాయి తిరిగి యధా స్థానంలో ఉండటంతో ఆశ్చర్యం వేసింది. దీంతో ఎవరో కావాలని తీస్తున్నారని గమనించి అర్ధరాత్రి సమయంలో వచ్చి చూడగా ఆ రాయి అందమైన దేవతా రూపం దాల్చి తెల్లని బట్టలు ధరించి గతంలో ఉన్న స్థానంలోకి వెళ్లిపోయింది. దీనిని చూసిన రైతు గ్రామస్తులకు చెప్పాడు. వారు నమ్మకపోతే మళ్లీ మరుసటి రోజు రాత్రి వారికి చూపించాడు. అప్పటి నుంచి ఆ ఊరు వారు అమ్మవారిని దేవతగా కొలుస్తున్నారు. అయితే రిజర్వాయర్‌ను 1983లో నిర్మించడం వలన దేవస్థానం ముంపునకు గురైంది.అక్కడ నుండి అమ్మవారిని తీయడానికి ప్రయత్నించగా వారికి కళ్లు కనిపించలేదని ప్రచారం ఉంది.అలయం చుట్ట్టూ కరకట్టను కట్టి ఆలయాన్ని అభివృద్ది చేశారు.
ఎమ్మెల్యే సహకారంతో ఏర్పాట్లు పూర్తి
అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సహకారంతో ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ సతీశ్‌కుమార్ తెలిపారు. భక్తులకు వీలుగా క్యూలైన్ల ఏర్పాట్లు, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైద్య సదుపాయం, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలో షెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.