మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 1 : కరోనా కారణం గా ఏడాదిన్నర కిందట మూతపడిన విద్యాసంస్థలు ఎట్టకేలకు పునర్‌ప్రారంభమయ్యాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా మిగతా పాఠశాలలు బుధవారం నుంచి తెరుచుకున్నాయి. మొత్తం 814 ప్రభుత్వ పాఠశాలల్లో 70, 511 మంది విద్యార్థులకుగానూ మొదటిరోజు 18,916మంది (27శాతం) హాజరయ్యారు. అదేవిధంగా 259 ప్రైవేట్ పా ఠశాలల్లో 56,929మంది విద్యార్థులకుగానూ 6,973 మంది (12శాతం) హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 25శాతం మంది విద్యార్థులు హాజరుకాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ప లు పాఠశాలల్లో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి స్వా గతం పలికారు. ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో సుందరంగా ఆలంకరించారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 1 : జడ్చర్ల మండలంలోని 89 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 7,031మంది విద్యార్థులకుగానూ 1,592మంది హాజరయ్యారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో 11,649మంది విద్యార్థులకుగానూ 722మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, ఎంఈవో మంజులాదేవి పలు పాఠశాలలను పరిశీలించారు. నాలుగేండ్లుగా మూతబడిన చిట్టెబోయిన్‌పల్లి పాఠశాలను జెడ్పీ వైస్‌చైర్మన్ చేతులమీదుగా ప్రారంభించారు. దాదాపు 20మంది విద్యార్థులతో పాఠశాల పునర్ప్రారంభమైంది. ఆలూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు, నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, సెప్టెంబర్ 1 : మండలంలోని ప్రభుత్వ పా ఠశాలలకు 35శాతం విద్యార్థులు హాజరయ్యారని ఎం ఈవో నాగయ్య తెలిపారు. కాగా, భూత్పూర్ ఉన్నత పాఠశాలను మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ పరిశీలించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహించాలని సూచించారు. అలాగే పలు గ్రామా ల్లో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు.
భౌతికదూరం పాటించాలి
మిడ్జిల్, సెప్టెంబర్ 1 : పాఠశాలల్లో విద్యార్థులు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని ఎంఈవో మంజులాదేవి అన్నారు. మండలంలోని రాణిపేట, కొత్తపల్లి, మిడ్జిల్ తదితర గ్రామాల్లో పాఠశాలలను తనిఖీ చేశారు. మండలంలో మొత్తం 2,218మంది విద్యార్థులకుగానూ మొదటిరోజు 410మంది హాజరయ్యారని ఎంఈవో తెలిపారు.
గండీడ్ మండలంలో..
గండీడ్/మహ్మదాబాద్, సెప్టెంబర్ 1 : ఉమ్మడి గండీడ్ మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 20శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంఈవో వెంకటయ్య తెలిపారు. మొత్తం 66 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, 13 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 7,300మంది విద్యార్థులకుగానూ 1,511మంది హాజరయ్యారని పేర్కొన్నారు. కొంరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలను జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి పరిశీలించారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, సెప్టెంబర్ 1 : మండలంలోని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలకు 35శాతం విద్యార్థులు హాజరయ్యారని ఎంఈవో లక్ష్మణ్‌సింగ్ తెలిపారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, సెప్టెంబర్ 1 : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,370మంది చదువుతుండగా, మొదటిరో జు 530మంది హాజరయ్యారని హెచ్ఎంలు ఆనంద్‌కుమార్, రఘునందన్‌రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్న పేర్కొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, సెప్టెంబర్ 1 : మండలకేంద్రంలోని పాఠశాలలను ఎంపీపీ బాలరాజు, కిష్టంపల్లి పాఠశాలను సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య ప్రారంభించారు. అదేవిధంగా సల్లోనిపల్లి, మునిమోక్షం పాఠశాలలను డీఈవో ఉషారాణి పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈవో రాజునాయక్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, సర్పంచ్ లక్ష్మీనారాయణ, రాములమ్మ ఉన్నారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 1 : అడ్డాకుల మం డలంలోని 53 పాఠశాలల్లో 4,232మంది విద్యార్థులకుగానూ 1,513మంది హాజరయ్యారని ఎంఈవో నాగయ్య తెలిపారు. అలాగే మూసాపేట మండలంలోని 27 పాఠశాలల్లో 2,414మంది విద్యార్థులకుగానూ 690మంది హా జరయ్యారని ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. పాఠశాల ల్లో విద్యార్థులు మాస్కులు ధరించి శానిటైజర్ వినియోగించేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, సెప్టెంబర్ 1 : మండలంలోని పాఠశాలల్లో మొత్తం 5,195మంది విద్యార్థులకుగానూ 1,745మంది హాజరయ్యారు. పాఠశాలలకు 33శాతం విద్యార్థులు హాజరయ్యారని సీఆర్పీ జనార్ధన్ తెలిపారు. కాగా, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు చేసి పాఠశాలలు ప్రారంభించారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, సెప్టెంబర్ 1 : మండలవ్యాప్తంగా ప్రభు త్వ పాఠశాలల్లో 3,676మంది విద్యార్థులకుగానూ 889మంది హాజరయ్యారని ఎంఈవో వెంకటయ్య తెలిపారు. మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.