
మహబూబ్నగర్, ఆగస్టు 17: జిల్లావ్యాప్తంగా మంగళవారం ముసురు వాన ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసింది. దీంతో జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు సూచించారు. 15రోజులుగా వర్షం కురువకుండా ఒక్కసారిగా వర్షం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటికే పరిమితయ్యారు. పంటపొలాల్లో వర్షంనీరు చేరడంతో రైతులు కొంత ఉపశమనం పొందారు. మరింత వర్షపాతం నమోదయితే చెరువులు, కుంటలు నిండి అలుగులు పారే అవకాశం ఉంది.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఆగస్టు 17: మండలకేంద్రంతోపాటు ఉడిత్యాల, మోతిఘణపూర్, గుండేడ్, ఊటుకుంటతండా, గౌతాపూర్, నేరళ్లపల్లి, వాయిల్కుంటతండా, నందారం, పెద్దాయపల్లి తదితర గ్రామాల్లో రెండురోజులుగా ముసురు వాన కురిసింది. దీంతో పంటలకు ఉపశమనం కలిగిందని రైతులు వాపోయారు. అదేవిధంగా పలు గ్రామాల్లో చెరువులు, వాగుల్లోకి వర్షపునీరు వచ్చింది.