రాజీవ్ స్వగృహలోని 202 ప్లాట్లకు రేపు వేలం
బృందావన గార్డెన్లో అధికారుల ఏర్పాట్లు
నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
గద్వాల, మార్చి 1: రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఖాళీగా ఉన్న రాజీవ్స్వగృహ ప్లాట్లకు వేలం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాలో చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ప్లాట్లు కబ్జాకు గురికావడంతో వాటిని విక్రయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులు విక్రయించిన ప్లాట్లు కొనుగోలు చేసినవారికి అక్కడ ప్లాట్లు అభివృద్ధి చేసి అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ప్లాట్లు విక్రయించేందకు కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని నదీఅగ్రహారం వెళ్లేదారిలో అంబర్టౌన్ షిప్ పరిధిలో 202ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గజం ధర రూ.5,500 నిర్ణయించింది. గతంలో ఈ పాట్లకు అంతగా ఆదరణ లేకపోవడంతో ఎవరూ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రియల్ భూమ్ పెరగడంతో ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో పేద ప్రజలకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకం అమలు తీరు సరిగా లేకపోవడంతో అప్పుడు వేసిన లేఅవుట్లు అలాగే ఉన్నాయి. వాటిని ఇప్పుడు ప్రజలకు మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని నిర్ణయించి వేలం పాటకు సిద్ధమవుతున్నది.
జిల్లాలో 202 ప్లాట్లకు వేలం
జిల్లాలో 202 ప్లాట్లకు ప్రభుత్వం వేలంపాట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికి తోడు అధికారులు జిల్లా కేంద్రంలో ప్లాట్ల కొనుగోలుపై సమావేశాలు నిర్వహించి విధివిధానాలు తెలియజేశారు. 275 గజాల నుంచి 511గజాల వరకు ప్లాట్లకు వేలం వేయనున్నారు. వీటి విక్రయంతో ప్రభుత్వానికి సుమారు రూ.70కోట్లపై ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వేలంలో పాల్గొనేవారు ఆదివారం నాటికి రూ.10వేలు కలెక్టర్ పేరిట డీడీ తీసి ఉండాలి. డీడీ తీసిన వారికి అధికారులు రసీదు అందజేస్తారు. రసీదు ఉన్న వారు మాత్రమే వేలంలో పాల్గొనాలి. నాలుగు రోజులపాటు ప్లాట్లకు వేలం పాట నిర్వహించనున్నారు. 14న ఉదయం జిల్లా కేంద్రంలోని బృందావన గార్డెన్లో అధికారులు ఉదయం 30 ప్లాట్లకు, మధ్యాహ్నం 30 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. ఇలా 14 నుంచి 17వ తేదీ వరకు ప్లాట్లకు వేలం వే యనున్నారు. గతంలో రూ.3వేలు డీడీ తీసినవారు ప్రస్తుతం రూ.10వేలు డీడీ తీయాల్సిన అవసరం లేదు. వేలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం గజం ధర రూ.5,500 నుంచి ప్రారంభమవుతుంది. పాటపాడే వారు రూ.100మాత్రమే పెంచూతూ పాడాలనే నిబంధన విధించింది.
చెల్లింపులు ఇలా…
రాజీవ్స్వగృహలో ప్లాట్లకు వేలం పాడి ప్లాటు పొందిన లబ్ధిదారులు చెల్లింపులకు ప్రభుత్వం నిబంధనలు విధించింది. నెలలో మొత్తం చెల్లింపులు చేస్తే 2శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ప్లాటు దక్కినవారు మొదటి విడుత వారం రోజుల్లో 1/3వంతు చెల్లించాలి. రెండో విడుత 45రోజుల్లో, మూడో విడుత 90రోజుల్లో చెల్లించే అవకాశం కల్పించింది. మూడు విడుతలు కట్టలేనివారు సంవత్సరానికి 10శాతం వడ్డీతో చెల్లించే అవకాశం కల్పించింది. ఒక వ్యకికి ఎన్ని డీడీలైనా కట్టే అవకాశం కల్పించింది. ప్లాటు పొందినవారు మళ్లీ వేలంపాటలో పాల్గొనే అవకాశం లేదనే నిబంధనలు విధించింది.