జడ్చర్లటౌన్, మార్చి 12 : రాజీ కుదిరే కేసుల్లో కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల కోర్టు జడ్జి టి.లక్ష్మి సూచించారు. జడ్చర్ల కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నచిన్న తగాదా కేసులతో కక్షిదారులు సమయం, డబ్బు వృథా చేసుకోవద్దన్న ఉద్దేశంతో లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్‌అదాలత్‌లో పరిష్కరించిన కేసుల తీర్పు అంతిమంగా ఉంటుందన్నారు. దీనిపై అప్పీలు చేసుకునే అవకాశం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జడ్చర్ల, భూత్పూ ర్, బాలానగర్, రాజాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని పలు క్రిమినల్ కేసులతోపాటు సివిల్, బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులను పరిష్కరించారు. అలాగే మాస్కులు ధరించని వారిపై నమోదైన కేసులు, డ్రంకెన్‌డ్రైవ్ తదితర కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ.శ్రీనివాస్‌గౌడ్, లోక్ అదాలత్ సభ్యులు మహేశ్వర్‌రెడ్డి, మాలిక్‌షాకీర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐ రమేశ్‌బాబు, ఎస్సైలు రాజేందర్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.