ఎవరడ్డుకున్నా అభివృద్ధి ఆగదు
అరాచకశక్తుల ఆగడాలు నడువనివ్వం
ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పాలమూరులో పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 8: మహిళలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో రూ.17కోట్ల 32లక్షలతో స్టేడియాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ప్రారంభించడంతోపాటు రూ.2కోట్ల 79లక్షలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అదనపు పనులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొని రూ.7కోట్ల 50లక్షల చెక్కు ను జిల్లా మహిళా సమాఖ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ప్రేమానురాగాలు ఉన్నంతకాలం వారి ఆశీస్సులతో మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్‌లో దోపిడీ, రౌడీయిజాన్ని సహించేంది లేదన్నారు. గత పాలనలో మహబూబ్‌నగర్ ఎలా ఉండేదో అందరికీ తెలుసని, నేడు మహబూబ్‌నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే కొంతమంది అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఏడేండ్లుగా మహబూబ్‌నగర్‌ను అన్నివిధాల అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని గుర్తుచేశారు.
హైదరాబాద్ తరహా మహబూబ్‌నగర్‌ను అన్నిరంగాల్లో ముందుంచుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, మహిళలను ఎవరైనా ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మినీట్యాంక్‌బండ్‌పై సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆర్అండ్బీ వద్ద రూ.6కోట్లతో నూతనంగా నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డీవైఎస్వో శ్రీనివాస్, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు రామ్, షేక్ఉమర్, నాయకులు రాజేశ్, కృష్ణమోహన్, రామలింగం, శ్రీనివాస్‌రెడ్డి, శివశంకర్, క్రీడాసంఘాల ప్రతినిధులు జగన్మోహన్గౌడ్, నిరంజన్‌రావు, వేణు, రాంచందర్, చంద్రశేఖర్‌గౌడ్, జ్యోతి, నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.