సర్కారు బడుల ముఖచిత్రం మార్చేసాం
‘మన ఊరు -మన బడి’ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్, మార్చి 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంతో ప్రభుత్వ విద్యా రంగం పటిష్టం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత వనపర్తికే దక్కిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు స్కూళ్ల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ప్రతిషాష్టాత్మక ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి వేదికగా మంగళవారం ప్రారంభించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను కూడా సర్కారు బడిలోనే చదువుకున్నట్లు సీఎం తెలిపారు. తమ గురువులు నేర్పిన విద్య వల్లే ఈ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రారంభిస్తున్న ఆంగ్ల మాధ్యమం చదువులను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని వనపర్తి నుంచి ప్రారంభించడం వల్ల ఈ ప్రాంతానికి గౌరవం దక్కిందన్నారు. విద్యార్థులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రభు త్వ విద్యారంగాన్ని సమూలంగా మార్చేసే మన ఊరు మన బడి కార్యక్రమాన్ని వనపర్తి నుంచి ప్రారంభించగా.. మూడేండ్లలో మూడు విడుతల్లో ఈ పథకం ద్వారా రూ.7,289.54 కోట్లతో 26వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తారు. తొలివిడుతలో 2021-22 విద్యాసంవత్సరంలో రూ.3,497.62 కోట్ల వ్యయంతో 9,123 స్కూళ్లల్లో 12 రకాల వసతులు కల్పిస్తారు. వచ్చే జూన్ కల్లా తొలివిడుత పనులను పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు గడువుగా పెట్టుకున్నారు.