అదనపు కలెక్టర్ శ్రీహర్ష
గద్వాల, మార్చి 7: జిల్లా కేంద్రంలోని నది అగ్రహారానికి వెళ్లే దారిలో ఉండే రాజీవ్ స్వగృహ ప్లాట్లను ఈనెల 14నుంచి 17వ తేదీ వరకు వేలం పాట నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీసమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండో ఫ్రీ బీడ్ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.10వేలు కలెక్టర్ కార్యాలయం పేరుమీద డీడీ తీయాలని చెప్పారు. వేలంలో ప్లాటు పొందిన వ్యక్తికి డీడీ నగదు తిరిగి ఇవ్వబడదని, ప్లాట్ రాని వారికి డీడీ నగదు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. గతంలో మీసేవలో దరఖాస్తు చేసుకున్నవారు వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. మీసేవ రసీదు లేనివారు కలెక్టరేట్లోని జాబితాలో పరిశీలించుకోవచ్చని సూచించారు. మొత్తం 202 ప్లాట్లకు వేలం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేలం పాట రూ.5500 నుంచి మొదలవుతుందని, ఆసక్తిగల అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. వేలంలో ప్లాటు పొందిన వారు వారం రోజుల్లో 33శాతం నగదు మొదటి విడుత చెల్లించాలని రెండో విడుత డిప్లోప్లాటు తగిలిన తేదీనుంచి 45రోజుల్లో చెల్లించాలని చెప్పారు. మిగతా నగదు 90రోజుల్లో చెల్లించడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఒకేసారి 90రోజుల్లో పూర్తి నగదు చెల్లిస్తే వారికి రెండు శాతం డిస్కౌంట్ ఇస్తామన్నారు. లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయం, రాజీవ్సగృహ ప్లాట్ల వద్ద హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13వ తేదీ వరకు ఆసక్తిగలవారు డీడీ తీసి కలెక్టరేట్లో ఇచ్చి రసీదు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అధికారులు నరేందర్‌రెడ్డి, మదన్మోహన్సింగ్, రాములు, జానకిరాముసాగర్, రాజు, రెవెన్యూ, ఇరిగేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.