కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా
సీఎం కేసీఆర్ పర్యటనపై సంబంధిత అధికారులతో సమావేశం
వనపర్తి, మార్చి 2: సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం సీఎం ముందుగా కర్నెతండాలో లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. తరువాత చిట్యాలలో వ్యవసాయ మార్కెట్‌యార్డు, డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో జాప్యం లేకుండా పూర్తి చేయాలని వ్యవసాయ మార్కెట్‌యార్డు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వనపర్తిలోని బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించి ఫైలాన్ లాంచ్ చేస్తారన్నారు. సమీకృత నూతన కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి వివిధ శాఖల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. లక్షా 50వేల మందికి సరిపడా ఏర్పాట్లు చేయాలని.. డయాస్, ఫర్నిచర్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు, అవసరమైన వసతులు సిద్ధం చేయాలన్నారు. పోలీస్ బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని, తాగు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశం అనంతరం మన ఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపికైన వనపర్తి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన డయాస్, ఫర్నిచర్, గ్రీన్ రూం, పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిట్యాలలోని డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించి, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు, నీటి వసతిని ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకోవాలని డీఈ నాగేశ్వరరావు, స్వర్ణసింగ్ను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో అమరేందర్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.