24గంటల కరెంట్, పెట్టుబడి సాయం, మద్దతు ధర
టీఆర్ఎస్ హయాంలో ఆనందంలో రైతులు
డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
దేశంలో సీఎం కేసీఆర్ గాలి వీస్తోంది
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
అయిజ, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడంతోపాటు 24గంటల కరెంట్, ఎరువులు, మద్ధతు ధర కల్పించడంలో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అయిజ పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన సీనియర్ విభాగం బండలాగుడు పోటీలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ గాలి వీస్తోందని అన్నారు. అన్ని రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు. ప్రతిఒక్కరూ తెలంగాణ నాగరికత, సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనిషి జీవనంలో పశు సంపద ముఖ్యమైనదన్నారు. పశువులతోనే రైతులకు ఆదాయం సమకూరుతుందన్నారు.
రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసి ఆదాయం పొందాలని సూచించారు. ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. అంతకుముందు మంత్రి నిరంజన్‌రెడ్డిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తిక్కవీరేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, మున్సిపల్ చైర్మన్లు చిన్నదేవన్న, కరుణ, విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ నాయకులు తిరుపతయ్య, బండారి భాస్కర్, గట్టు తిమ్మప్ప, అజయ్, చిన్న హన్మంతు, శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.