ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు
43మందికి రూ.15.64లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు
ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 28: ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండగా నిలుస్తాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామంలో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని 43 మంది లబ్ధిదారులకు రూ.15.64లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేసి మాట్లాడారు. జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న నల్లచెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువు, రాజనగరం చెరువు, శ్రీనివాసపూర్ లక్ష్మికుంటను పునర్నిర్మించి పటిష్టం చేస్తున్నామన్నారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చెరువులు, కుంటలపై వాకింగ్‌ట్రాక్‌లు, బోటింగ్, గార్డెనింగ్ తదితర సుందరీకరణ పనులను చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
వనపర్తిలో రోడ్ల విస్తరణ కొనసాగుతున్నదని, పట్టణం నుంచి వచ్చే మురుగునీటి వ్యవస్థను శుద్ధి చేసేందుకు సీవరేజ్ ప్లాంట్‌ను నిర్మిస్తామని, పెబ్బేర్, పాన్‌గల్, కొత్తకోట రహదారులను కలుపుతూ బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామన్నారు. పీర్లగుట్ట, చిట్యాల, పెద్దగూడెం క్రాస్‌రోడ్డులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. ఇండ్ల కేటాయింపులో నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని, ప్రజల అవసరాలే ప్రాతిపదికగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అన్నివర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రమేశ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, మున్సిపల్ కోఆఫ్షన్ సభ్యుడు ఇమ్రాన్, నాయకులు తిరుమల్, రాము, జహంగీర్, రహీం, జోహెబ్ తదితరులు పాల్గొన్నారు.
ఏడేండ్లలో అన్నపూర్ణగా తెలంగాణ
ఉమ్మడి రాష్ట్రంలో అన్నమో రామచంద్రా అన్న తెలంగాణ.. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ చలువతో ఏడేండ్లలో అన్నపూర్ణగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివుడి అనుగ్రహం, కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాల వల్ల వ్యవసాయం బలపడిందని, సాగు, ఉత్పత్తులు పెరిగాయన్నారు. పట్టణంలో రహదారుల విస్తరణకు సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వనపర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు సాధించుకున్నామని, 54 మినీ ఎత్తిపోతల పథకాలతో మిట్ట ప్రాంతాల రైతులకు 5,500 ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. కర్నెతండా ఎత్తిపోతల పనులకు త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని, ప్రైవేట్ సంస్థల సహకారంతో మోజర్ల లిఫ్ట్ పనులు జరుగుతున్నాయన్నారు. శివుడి ఆశీస్సులతో కరోనా వైరస్ మళ్లీ రాకుండా వేడుకుంటున్నానని, ప్రజలందరూ శివరాత్రి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ప్రకటనలో కోరారు.