13వ శతాబ్దానికి చెందినదిగా గుర్తింపు
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
చిన్నచింతకుంట, ఫిబ్రవరి 28: మండలంలోని ముచ్చింతల సమీపంలోని ఊకచెట్టు వాగులో సోమవారం కాకతీయుల కాలం నాటి 13వ శతాబ్దానికి చెందిన చెన్నకేశవస్వామి విగ్రహం బయటపడింది. గ్రామానికి పశ్చిమ దిశలోని ఊకచెట్టు వాగు మీద చెక్‌డ్యాం నిర్మాణానికి ఇసుకను తొలగిస్తుండగా ముందుగా నల్లమొద్దు కొయ్యలు కనిపించాయని, వాటిని తొలగించగా నల్లశానపు రాతి విగ్రహం బయటపడిందని స్థానికులు తెలిపారు. స్థానికులు వెంటనే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం అందించారు. పురావస్తు పరిశోధకుడు డాక్టర్ శివనాగిరెడ్డికి ఎమ్మెల్యే విగ్రహం లభించిన సమాచారాన్ని తెలిపారు. నాలుగు అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంగల నల్లశానరాతి పురాతన చెన్నకేశవస్వామి విగ్రహం బయటపడింది. విగ్రహానికి రెండు చేతుల్లో శంఖుచక్రాలు, ఒక చేతిలో పద్మం, మరో చేతిలో గద ధరించి అటు ఇటు పరిచారికలు కలిగి ఉందని, ప్రతిమ లక్షణాలను బట్టి విగ్రహం కాకతీయుల కాలానికి చెందినదని శివనాగిరెడ్డి తెలిపారు. కాకతీయ చివరి పాలకుడైన ప్రతాప రుద్రుడిని బందీగా ఢిల్లీ సుల్తానులు తీసుకెళ్లిన సందర్భంగా స్థానికులు ఈ విగ్రహాన్ని భూమికి 15అడుగుల లోతులో భద్రపరిచి ఉంటారని ఆయన తెలిపారు. అపురూపమైన ఈ విగ్రహానికి ఆలయం నిర్మించే విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. వాగులో బయటపడిన విగ్రహానికి ఎమ్మెల్యే ఆల, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.