చేనేత సహకార సొసైటీ పాలక వర్గాల గడువు పెంపు
గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో 43 సొసైటీలకు అవకాశం
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు
గద్వాల, ఫిబ్రవరి 26;చేనేత సహకార పాలకవర్గానికి ప్రభుత్వం గడువు పొడిగించింది. మరో ఆరు నెలల పెంపుతో జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లోని 43 చేనేత, సిల్క్, ఉన్ని సహకార సంఘాలకు ఊరట లభించింది. నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి చేయూతనిస్తున్నది.
చేనేత సహకార పాలకవర్గ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో జోగుళాంబ గ ద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో 43 చేనేత, సిల్క్, ఉన్ని సహకార సంఘాలకు ఈ నిర్ణయంతో ఊరట లభించింది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం చేయూతనిస్తున్నది. పథకాల అమలులో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఫిబ్రవరి 10, 2013న జరిగిన ఎన్నికల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాల గడువు ఫిబ్రవరి 11, 2018తో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం గడువు పెంచుతూ వచ్చింది. 2021 ఫిబ్రవరి 10న గడువు ముగియగా.. ఆగస్టులో మళ్లీ ఆరు నెలలు పొడిగించింది. ఆ గడువు ఈ నెల 9న ముగియగా దానిని మరో ఆరు నెలలు పెంచుతూ సర్య్కులర్ విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి ఆగస్టు 9, 2022 వరకు పాత పాలకవర్గ సభ్యులే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగనున్నా రు. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో చేనేత, పవర్లూం, ఉన్ని, సిల్క్ సహకార సంఘాలు 43 ఉన్నాయి. అందులో జోగుళాంబ గ ద్వాలలో 19, వనపర్తిలో 13, నాగర్కర్నూల్లో 11 సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘం కార్యవర్గంలో 9 మంది డైరెక్టర్లు ఉంటారు.
జీవో విడుదల చేసిన సర్కార్..
చేనేత జౌళి సహకార సంఘాల సొసైటీలకు ప్రభుత్వం ఆరు నెలలు గడువు పెంచుతూ జీవో విడుదల చేసింది. దీంతో చేనేత జౌళి శాఖ సంఘాల పాలకవర్గాలు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగుతారు. వీరు చేనేత సంఘాలను నిరంతరం పర్యవేక్షణ చేయడంతోపాటు బలోపేతానికి కృషి చేస్తారు.
– గోవిందయ్య, సహాయ సంచాలకులు, చేనేత జౌళి శాఖ