ఇన్చార్జి కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా
గద్వాల, ఫిబ్రవరి 26: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన మంజూరు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ యాస్మిన్‌బాషా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హత కలిగిన విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు అందేలా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతివిద్యార్థికీ ఉపకారవేతనం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. దరఖాస్తులను ఈపాస్పోర్టల్లో నమోదు చేయాలని, హార్డ్ కాపీలను అందుబాటులో ఉంచి కళాశాల స్థాయిలో దరఖాస్తులు పరిశీలించాలని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పెండింగ్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలో కళాశాలల స్థాయిలో పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమశాఖ అధికారులు శ్వేత, శ్రీనివాస్, ప్రసాద్‌రావు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
ఆవిష్కర్తలకు ఆర్థిక సహకారం
గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు స్టేట్ ఇన్నోవేషన్ ఫర్ రూరల్ ఇంపాక్ట్ ఇన్సెంటీవ్ నుంచి ఆర్థిక సహకారం అందించడానికి ఆవిష్కర్తల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ యాస్మిన్‌బాషా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొంది ఉన్న ఆవిష్కరణ లేదా పూర్తిగా రాష్ట్రంలోనే అభివృద్ధి చేయబడ్డ ఆవిష్కరణలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. htt//teamtsic.telangana.gov.in/tsiri-incenti ves పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రతిమొక్కనూ సంరక్షించాలి
ఎర్రవల్లి చౌరస్తా, ఫిబ్రవరి 26: ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి గ్రామాన్ని ఇన్చార్జి కలెక్టర్ యాస్మిన్‌బాషా శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి చౌరస్తా -గద్వాల రోడ్డు వెంట హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, ట్రీగార్డ్స్‌ను పరిశీలించారు. నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కార్యదర్శి ప్రభావతి, సర్పంచ్ రవిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉమాదేవి, ఎంపీడీవో రవీందర్, ఎంపీవో భాస్కర్ తదితరులు ఉన్నారు.
నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలి
జిల్లాలో చేపడుతున్న పంచాయతీ రాజ్ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ యాస్మిన్‌బాషా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీసీరోడ్ల పనులు అధికారులు సమన్వయంతో చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డు కలిగిన ప్రతికూలీకి పనులు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఉపాధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో వెనుక బడిన పంచాయతీల్లో ఉపాధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. నర్సరీల నిర్వాహణ ఏపీవో, ఎంపీవోల బాధ్యతని చెప్పారు. అధికారులు మండలంలో మూడు జీపీలు సందర్శించి పనుల తీరును పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, డీఆర్డీవో ఉమాదేవి, డీపీవో శ్యాంసుందర్, పీఆర్ ఈఈ సమత తదితరులు పాల్గొన్నారు.