ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా
వనపర్తిరూరల్, ఫిబ్రవరి 26: జిల్లాలోని ప్రతి చిన్నారి నిండు జీవితానికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా అన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించి శనివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 27నుంచి మార్చి 1తేదీ వరకు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి వైద్యసిబ్బంది ఏర్పా ట్లు చేశారని తెలిపారు. జిల్లాలో 54,104మంది ఐదేండ్లలోపు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 14 మండలాలల్లో 400బూత్‌ల ద్వారా చుక్కలమందు వేయనున్నట్లు తెలిపారు. వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశవర్కర్లతోపాటు ఆయా శాఖల సమన్వయంతో వందశాతం లక్ష్యం చేరుకునేలా ప్రణాళిక రూపొందించారన్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లో 24గంటలు సేవలు అందుబాటులో ఉండేలా వైద్యాధికారులకు సూచించారు. జిల్లాకు 3,595 వాయిల్స్ చేరుకున్నాయని, పీహెచ్‌సీల వారీగా కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచినట్లు తెలిపారు. మొదటిరోజు బూత్‌ల వారీగా వేయనున్నారని, మిగిలిపోయిన వారికి ఫిబ్రవరి 28, మార్చి 1న ఇంటింటికీ వెళ్లి వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇటుక బట్టీలు, క్వారీలు, వలస, భవన నిర్మాణ కార్మికుల పిల్లలు, హైరిస్క్గల 135 ప్రాంతాలను గుర్తించామన్నారు. మదనాపురం రైల్వేస్టేషన్లో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారని, జిల్లావ్యాప్తంగా 13 మొబైల్ టీంలు 41 రూట్ సూపర్వైజర్లు మొత్తం 400 టీంలకు గానూ 1600 మందిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చందునాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, ప్రోగ్రామింగ్ అధికారి రవిశంకర్, పోలియో ఇమ్యూనైజషన్ అధికారి రామచంద్రరావు, డీడబ్ల్యూవో పుష్పలత, ప్రోగ్రామింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.