సేంద్రియ పద్ధతిలో కిచెన్ గార్డెన్
పెద్దకొత్తపల్లి కేజీబీవీలో ఏర్పాటు
12 మంది విద్యార్థులతో కమిటీ
నాగర్‌కర్నూల్, మార్చి 12 : పెద్దకొత్తపల్లి కేజీబీవీని వ్యవసా య క్షేత్రంగా తీర్చిదిద్దారు. విద్యార్థినులకు కావాల్సిన కూరగాయలను పాఠశాలలోనే స్వయంగా పండించుకుంటున్నారు. తాజా కూరగాయలతో ఆహారాన్ని వండుతున్నారు. పాఠశాల ఆవరణలోని కొద్దిపాటి స్థలంలో విద్యార్థినులే ప్రత్యేకంగా కమిటీగా ఏర్పడి అన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. కేజీబీవీ ఎస్వో లత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. కిచెన్ గార్డెన్లో సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 12 మంది విద్యార్థినులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తరగతులు ముగిశాక విద్యార్థినులు 15 నిమిషాలపాటు కిచెన్ గార్డెన్లో కలుపు తీత, మొక్కలకు నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. దీంతో వారికి పంటల సాగుపై అవగాహనతోపాటు పనిపై గౌరవం కలుగుతుందని ఎస్వో చెబుతున్నారు. కిచెన్ గార్డెన్‌కు సిబ్బంది కూడా సహకారం అందిస్తున్నారు. ఆనంకాయ, బీరకాయ, వంకాయ, చిక్కుడు, కాకర, టమాట, దోసకాయ, పాలకూర, కొత్తిమీర, మెంతికూర, పుదీన, బొప్పాయి, మునగ వంటి కూరగాయలు పండిస్తున్నారు. పురుగు మందులను వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నారు. దీంతో తాజా కూరగాయలతో పౌష్టికాహారం అందుతున్నది. పాఠశాలకు వస్తున్న తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. తమ పిల్లలు వారు పండించిన కూరగాయలతోనే ఆహారం తింటున్నారనే విషయం తెలుసుకొని సంతోషిస్తున్నారు.
పౌష్టికాహారమే లక్ష్యం..
విద్యార్థినులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల ఆవరణలో కిచెన్‌గార్డెన్ ఏర్పాటు చేశాం. మా పాఠశాల ఆవరణలో పండించిన కూరగాయలతోనే భోజనాన్ని అందిస్తున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థినులకు పౌష్టికాహారాన్ని అందించడం సంతోషంగా ఉంది. గ్రామ పంచాయతీ తోడ్పాటుతో సాగు విస్తరణకు కృషి చేస్తాం.
– లత, ఎస్వో, పెద్దకొత్తపల్లి కేజీబీవీ
వంటలు రుచికరంగా ఉన్నాయి..
మా పాఠశాల ఆవరణలో పండించిన తాజా కూరగాయలతో భోజనం చేయడం చాలా ఆనందంగా ఉంది. కూరగాయలు తాజాగా ఉండడం, పురుగుల మందుల వినియోగం లేకపోవడంతో వంటలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. ప్రతిరోజూ కొద్ది సమయాన్ని కేటాయించి మొక్కలు సంరక్షిస్తున్నాం. చదువుతోపాటు వ్యవసాయంలోనూ మెళకువలు నేర్చుకుంటున్నాం.
– రాధిక, 8వ తరగతి, పెద్దకొత్తపల్లి కేజీబీవీ
నాణ్యమైన భోజనం..
చదువుతోపాటు నాణ్యమైన భోజనం అందించడం మా పాఠశాల నిర్వాహణకే సాధ్యం. ప్రతిరోజూ కొంత సమయం వెచ్చించి కూరగాయల సాగు విధానం నేర్చుకుంటున్నాం. అన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్నాం. తాజా కూరగాయలతో రక్తహీనత దరిచేరకుండా ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం.
– ఝాన్సీ, 9వ తరగతి