అయిజ, అక్టోబర్ 5: తుంగభద్ర నీటి కేటాయింపులో ఆర్డీఎస్ ఆయకట్టు నీటి వాటా 15.9 టీఎంసీలు ఉందని, ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నీటిని అక్రమంగా ఎగువ కాల్వల ద్వారా తరలిస్తున్నది. జలాల తరలింపును వెంటనే నిలిపివేయాలని తెలంగాణ జలమండలి ఈఎన్సీ మురళీధర్ టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్కు లేఖ రాశారు. తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆయకట్టుకు 15.9 టీఎంసీల కేటాయింపు ఉందన్నారు. ఏనాడు ఆర్డీఎస్ ఆయకట్టుకు 5,6 టీఎంసీల కన్నా మించి నీరు చేరలేదన్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమ నీటి తరలింపు కృష్ణా నీటి వివాదం ట్రిబ్యునల్-1 (కేడబ్ల్యూడీటీ-1) అవార్డుకు విరుద్ధమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తుంగభద్ర, కృష్ణా జలాలను అక్రమంగా బేసిన్ వెలుపలికి తరలించి ఆయకట్టును పెంచుకుంటుందన్నారు. ఒక వైపు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా మల్యాల, ముచ్చుమర్రి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కేసీ కెనాల్‌కు నీటిని తరలిస్తుందని తెలిపారు. అంతేకాకుండా టీబీ డ్యాం ద్వారా ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ కాల్వలకు కేసీ కెనాల్ నీటిని గతంలోనే 2 టీఎంసీలను తరలించిందన్నారు. ప్రస్తుతం మరో 2టీఎంసీల నీటిని టీబీఆర్‌బీ హెచ్ఎల్సీ ద్వారా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేసీ కెనాల్ ఇండెంట్ నీటిని టీబీఆర్‌బీ హెచ్ఎల్సీ ద్వారా తరలిస్తే ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. నవంబర్ నుంచి మే నెల వరకు తుంగభద్రలో నీటి లభ్యత ఉండదన్నారు. ఈ తరుణంలో ఇండెంట్ నీటిపైనే ఆర్డీఎస్ ఆయకట్టు ఆధారపడి ఉంటుందన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు కేటాయించిన నీటిని టీబీ డ్యాం ద్వారా విడుదల చేయడంతో పాటు కేసీ కెనాల్ నీటిని తుంగభద్ర నది ద్వారానే తీసుకోవాలని కోరారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ చేపట్టినా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను విధిగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఎన్సీ టీబీ బోర్డు కార్యదర్శిని కోరారు.